ముంబైలోని IIT బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడ్ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరీక్షలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీ వినియోగం వ్యవహారం తర్వాత సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుమారుడిని ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల వేధించారని, కుల వివక్షకు గురి చేశారని సాహిల్ తండ్రి ఆరోపించారు. దీంతో విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు పెట్టిన 18 డిమాండ్లపై IIT బాంబే డైరెక్టర్ అంగీకారం తెలిపారు. దూళ్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆయనపై సంస్థ చర్యలు చేపట్టింది.
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని చేర్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ ప్రతిపాదనను సీఎం సి. జోసెఫ్ విజయ్ ముందుంచగా, ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. తొలుత ఎంపిక చేసిన పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి, పరిశుభ్రత, ఆహార భద్రత, తయారీ, సరఫరా వంటి అంశాలను పరిశీలించనున్నారు.
ముంబైలోని పవాయ్‌లో ఉన్న ఐఐటీ బాంబే క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతికినట్లు ఆరోపణలు రావడం, అనంతరం క్యాంపస్‌లో ఈ విషయంపై ప్రచారం జరగడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణలో దసరా పండుగ సందడి మొదలైంది. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సందర్భంగా 13 రోజుల సెలవులు రానున్నాయి. అక్టోబర్ 10 నుంచి 22 వరకు సెలవులు ఉండగా అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో బిర్యానీ తిన్న 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కూడా అనారోగ్యానికి గురికాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
NTA Exam Schedule: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ 2027 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు నల్లగొండ జిల్లాకు చెందిన వలిగొండ నరసింహ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో కూలీ, మేస్త్రీ పనులు చేస్తూనే చదువును కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి.. డాక్టరేట్ అందుకున్న స్థానానికి ఎదిగారు.
తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ పార్టీ విధివిధానాలను వెల్లడించారు. యువతకు 66 శాతం రాజకీయ ప్రాతినిధ్యం, రైతులు-గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్, పెట్రో ఉత్పత్తులపై పన్నుల తగ్గింపు, నీటి నిల్వ సామర్థ్యాన్ని 3,000 టీఎంసీలకు పెంపు, విద్య-ఉద్యోగాలపై దృష్టి వంటి ఐదు ప్రధాన అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోగా పేర్కొన్నారు.
తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రెండేళ్లు సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలకు టీచర్లు భాగస్వాములు కావాలని, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
విజయవాడలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్ననాటి రోజుల్లో ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. మారుతున్న కాలానికి అనుగుణంగా టీచర్లు కూడా తమ బోధనా విధానాలను మార్చుకోవాలని సూచించారు.
సిద్దిపేట శ్రీకృప ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీకి చెందిన బి.ఫార్మసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎం.ఫార్మసీ కౌన్సిలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10, 12వ తరగతి విద్యార్థుల మార్క్‌షీట్లలో ‘Fail’ అనే పదాన్ని ఉపయోగించకూడదని నిర్ణయించింది.
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా వరంగల్ పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వేలాది విద్యాసంస్థలు బకాయిల కారణంగా సంక్షోభంలో ఉంటే.. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థలు సమానత్వం, క్రమశిక్షణ కోసం యూనిఫాం నిబంధనలను అమలు చేసే హక్కు కలిగి ఉంటాయని స్పష్టం చేసింది.
పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోందని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ ఉప్పల్ రింగ్‌రోడ్డులో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ నిర్వహించారు. ‘యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం’ ఆధ్వర్యంలో ‘సేవ్ టీచర్.. సేవ్ స్కూల్’ నినాదాలతో టీచర్లు ర్యాలీ చేపట్టారు.
హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలో నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్‌లోని విద్యార్థులకు టెక్ దిగ్గజం గూగుల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్హత ఉన్న కళాశాలల విద్యార్థులు ఏడాది పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. చదువుకు ఉపయోగపడే స్టడీ నోట్‌బుక్స్, ఫ్లాష్‌కార్డ్స్, ప్రాక్టీస్ క్విజ్‌లు, ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ వంటి ఏఐ టూల్స్‌ను కూడా గూగుల్ అందిస్తోంది.
ఏపీ డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలు, లీకేజీపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. డీఎస్సీ అంశంపై శాసన మండలిలో చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇకపై ముందుగానే విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏటా రూ.2,400 కోట్లు అందించి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు.
పుల్లలచెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నానాలు, మరుగుదొడ్లకు కూడా నీరు అందకపోవడంతో బకెట్లతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఝార్ఖండ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. నిరసనలకు సంబంధించి పోలీసులు 600 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 500 మంది గుర్తుతెలియని విద్యార్థులు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పాత డిగ్రీ బ్యాచ్‌ల విద్యార్థులకు కీలక అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్స్ కారణంగా డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2000-01 నుంచి 2015-16 విద్యా సంవత్సరాల మధ్య BA, B.Com, B.Sc, BBA, BSW కోర్సుల్లో చేరిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.