బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అమరావతిలో కేటీఆర్ భార్య శైలిమా పేరుతో భారీగా హోటల్ నిర్మించారంటూ ఆరోపించిన ఆయన యశోద ఆసుపత్రికి ప్రభుత్వ భూముల కేటాయింపు, మెడికోవర్ సంస్థతో సంబంధాలు, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
హైదరాబాద్ మహానగర పరిధిలో ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక సూచన చేసింది. తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా చెల్లించాల్సిన రూ.1 లక్ష మొత్తాన్ని చెల్లించేందుకు గడువును అక్టోబర్ 9 వరకు పొడిగించింది. ఈలోగా చెల్లింపు చేయని వారి తాత్కాలిక కేటాయింపులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్క్ చుట్టూ అమలు చేస్తున్న సింగిల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ప్లానింగ్‌లో మార్పులు చేయడం ద్వారా సుమారు రూ.400 కోట్లు ఆదా చేయనుంది.
హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద సుమారు 800 గ్రాముల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. దీని విలువ దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో భారీ చోరీ కలకలం రేపింది. వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఓ గోల్డ్ షాప్ షెట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాలతో పాటు బంగారు ఆభరణాలను అపహరించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, FRRO, ఐటీ సెల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపగా.. మరో 37 మందిని హోల్డింగ్ సెంటర్లలో ఉంచారు. విచారణలో నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మోసాలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర పూల పండుగ బతుకమ్మ వేడుకలను ఈ నెల 10 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చివరి రోజు సద్దుల బతుకమ్మను హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు పలు సూచనలు చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డిజిటల్ యుగంలో పెన్నుల వినియోగం తగ్గుతున్నా వాటిపై అభిమానం మాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ‘హైదరాబాద్ పెన్ షో-2026’ నిలుస్తోంది. రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వచ్చిన తయారీదారులు అరుదైన, ప్రత్యేకమైన పెన్నులను ప్రదర్శిస్తున్నారు. రూ.50 నుంచి ఏకంగా రూ.7.80 లక్షల విలువైన పెన్నులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హఫీజ్‌పేట్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధులను మార్చింది. కొన్ని స్టేషన్ల పేర్లను సవరించగా, మరికొన్ని ప్రాంతాలను ఇతర పోలీస్ స్టేషన్లలో విలీనం చేసింది.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ఆలయంలోకి కర్రతో ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారిపై దాడికి యత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. అప్రమత్తమైన భక్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు నగరంలో ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. కడపకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికుడిని విమానం నుంచి దించి పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఇక ఆర్టీసీ బస్సు, మెట్రోలో ప్రయాణించేందుకు ప్రతిసారీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే కామన్ పాస్‌తో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణించే సౌకర్యాన్ని అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. డే, వీక్లీ, నెలవారీ పాస్‌లతో పాటు ఆర్టీసీ పాస్‌లను మొబైల్ యాప్ ద్వారా పొందే సదుపాయం కూడా ప్రారంభం కానుంది.
తెలంగాణ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మిని కేబినెట్ సమావేశానికి అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి తనకు ఆహ్వానం లేదని అధికారులు చెప్పడంతో ఆమె సీఎంవోను సంప్రదించినప్పటికీ అక్కడా స్పష్టత లభించలేదని సమాచారం.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్లపై సైబరాబాద్ పోలీసులు నిఘా పెంచారు. పేకాట, వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అపార్ట్‌మెంట్లను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్దెదారుల వివరాలు, గుర్తింపు పత్రాలు, బస ఉద్దేశం వంటి సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రాపర్టీ ఓనర్లకు సూచించారు. నిబంధనలు పాటించకపోతే కేసులతో పాటు ఆస్తుల సీజ్‌కు కూడా అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ అనగానే బిర్యానీ, హలీమ్ గుర్తొస్తాయి. అయితే నగరానికి శతాబ్దాల నాటి మరో అరుదైన మిఠాయి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. అదే ‘బాదం కి జాలీ’. నిజాంల కాలం నాటి ఈ సంప్రదాయ స్వీట్‌కు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. బాదం, పంచదార, యాలకులతో కళాత్మకంగా తయారయ్యే ఈ మిఠాయి గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చేసిన పోస్టుతో మరోసారి చర్చ మొదలైంది.
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా మతాలు, దేవుళ్ల అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని, హైదరాబాద్‌లో పరిస్థితులు సాధారణంగా ఉండవని ఆయన హెచ్చరించారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం అమల్లోకి రానుంది. వైన్ షాపులు, బార్లు, పబ్‌లతో పాటు చికెన్, మటన్, బీఫ్ విక్రయ దుకాణాలు, జంతువధశాలలను మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధైర్యముంటే కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. హైటెక్ సిటీ సమీపంలోని స్టార్ హోటళ్లతో పాటు అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులపై కూడా రేవంత్ ప్రశ్నలు సంధించారు.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టయింది. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగులోని లగ్జరీ చాక్లెట్ బాక్సుల్లో దాచిన 4.9 కిలోల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.24.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ వ్యవస్థాపకుడు వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న తనకు ఇన్సులిన్ ఆపేయాలని సూచించారని, ఆ తర్వాత డయాబెటిక్ కీటోయాసిడోసిస్, తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు స్థానాలకూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఎంపిక చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.
తెలంగాణలోని మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుగా నమోదుకు అర్హులైన వారు Form-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా తాజా జాబితాలో చేరేందుకు మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని ఓయో హోటల్‌లో మహిళ హత్య కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి హోటల్‌లో దిగిన శిరీష గదిలో రక్తపు గాయాలతో మృతిచెందిన స్థితిలో కనిపించింది. ఆమెతో వచ్చిన శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. డ్రైవింగ్ టెస్టుల్లో రికమండేషన్లు, పైరవీలకు చెక్ పెట్టడంతో పాటు పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ టెక్నాలజీని తీసుకురావాలని రవాణా శాఖ నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లోని ఐదు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ఆర్టీఓ ట్రాక్‌లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.