వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరై, గర్భం దాల్చిన సందర్భాల్లో అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. యువతికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్ సదన్’కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బారికేడ్ ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపారు. అనంతరం రాహుల్, ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆందోళనకారులను తరలించేందుకు సిద్ధమైన పోలీసు బస్సు డ్రైవర్ వద్ద నుంచి ఓ మహిళా కార్యకర్త తాళం చెవిని లాక్కొని బస్సు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హులైన ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. గణేష్ నిమజ్జనం పూర్తయిందని, జ్ఞానేష్ నిమజ్జనం మాత్రం మిగిలి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని కాపాడేందుకు ప్రజలు ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహి మసీదులోని కొంత భాగాన్ని తొలగించే చర్య ఉద్రిక్తతకు దారితీసింది. సింహస్థ 2028 ఏర్పాట్లలో భాగంగా రోడ్డు విస్తరణ కోసం అధికారులు చర్యలు చేపట్టగా వాటిని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వడంతో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27న జరిగిన ED సోదాలకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సోదాల్లో ఏం గుర్తించారు, ఏం స్వాధీనం చేసుకున్నారు, కేసులో ఇప్పటివరకు ఏం పురోగతి సాధించారో వెల్లడించాలని EDని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ED కార్యాలయం వద్ద నోట్ల కట్టలపై పొంగులేటి కూర్చున్నట్లుగా రూపొందించిన కటౌట్‌ను ప్రదర్శించారు. ఇదే అంశంపై కేటీఆర్ కూడా స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ తీరుపై ప్రశ్నలు సంధించారు.
యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు విధించాలన్న నిర్ణయంపై వ్యాపార సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైబడిన P2M యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDR అమల్లోకి రానున్న నేపథ్యంలో, అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ పాటించాలని పలు వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంక్ బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బారికేడ్లు తొలగించడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ముంబైలోని IIT బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడ్ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరీక్షలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీ వినియోగం వ్యవహారం తర్వాత సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుమారుడిని ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల వేధించారని, కుల వివక్షకు గురి చేశారని సాహిల్ తండ్రి ఆరోపించారు. దీంతో విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు పెట్టిన 18 డిమాండ్లపై IIT బాంబే డైరెక్టర్ అంగీకారం తెలిపారు. దూళ్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆయనపై సంస్థ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వచ్ఛ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోగా పలువురు మహిళా కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని నిఫాడ్ నగర పంచాయత్ కార్యాలయంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శివసేన (యూబీటీ) యువసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కుక్క పిల్లలను సంచుల్లో తీసుకెళ్లి ఏకంగా పంచాయత్ ప్రధాన అధికారి టేబుల్‌పై వదిలారు. అంతేకాకుండా కరెన్సీ నోట్ల దండతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. సెప్టెంబర్ 18లోగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే హైదరాబాద్ దిగ్బంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా సమస్య పరిష్కారం కావడం లేదంటూ టవర్ పనుల కోసం వచ్చిన టెలికాం టెక్నీషియన్‌ను చుట్టుముట్టి, ఏకంగా మొబైల్ టవర్‌కు కట్టేశారు.
రాజస్థాన్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య ఓ యువకుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నెల రోజులుగా సిగ్నల్స్ సరిగా రావడం లేదంటూ పుష్కర్ అనే యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సమస్య పరిష్కరించకపోతే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించడంతో పోలీసులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు టెలికాం సిబ్బంది నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించడంతో యువకుడు కిందకు దిగాడు.
శాసనసభ వద్ద సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఫిర్యాదుల ఆధారంగా కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భద్రతా సిబ్బందిపై దాడి, మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపులు, స్పీకర్‌ను దూషించడం వంటి ఆరోపణలు కేసుల్లో నమోదయ్యాయి.
గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెయ్యి డప్పులతో ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫాంహౌస్‌కు బయలుదేరడంతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అసెంబ్లీ వద్ద నిరసన సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకోగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల టీషర్టులపై అసభ్యకర పదాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండటంతోనే వారిని అసెంబ్లీలోకి అనుమతించలేదని తెలిపారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో తన చీర లాగారని, కాలికి గాయమైందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి సంబంధించిన కేసును మాత్రం కొనసాగించేందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాలతో సంతృప్తి చెందిన సీజేపీ.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేయగా.. దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా వరంగల్ పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోందని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు.