అమరావతి, ఆగస్టు 11 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల పల్లెలు, ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 158 మారుమూల ఆవాసాలకు తొలిసారి రహదారి అనుసంధానం కల్పించేందుకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద రూ.422.10 కోట్లతో 347 కిలోమీటర్ల మేర 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నారు.
రాష్ట్రంలోని చిట్టచివరి గ్రామానికి కూడా అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇప్పటికే ‘అడవితల్లి బాట’ కార్యక్రమం ద్వారా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు గిరిశిఖర గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు. తాజాగా మైదాన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేని మారుమూల పల్లెలు, ఆవాసాలకు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి.
347 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం
ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పూర్తి రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈ పనులను చేపట్టనుంది. రోడ్ల నిర్మాణంతోపాటు ఐదేళ్ల నిర్వహణ కోసం మరో రూ.24.47 కోట్లు విడుదల చేశారు.
నాణ్యతలో రాజీ వద్దు
రహదారుల నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిర్మించే రోడ్లు దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.
‘‘రహదారి సౌకర్యం లేని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యం. రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడతాయి. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం
కొత్తగా నిర్మించనున్న రోడ్లతో మారుమూల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రయోజనం కలగనుంది. రహదారి అనుసంధానం లేని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.





















