విశాఖపట్నం,సెప్టెంబర్ 15 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) మృతి చెందారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుకు గురైన ఆయన 57 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
కాంగ్రెస్‌తో రాజకీయ అరంగేట్రం
ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం ఆళ్ల నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి ఎదురైంది.
2019లో డిప్యూటీ సీఎం.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్ మంత్రివర్గంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిక
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇలా కాంగ్రెస్‌తో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. వైసీపీలో కీలక పదవులు, డిప్యూటీ సీఎం బాధ్యతలు, ఆ తర్వాత టీడీపీలో చేరిక వరకు సాగింది. తాజాగా గుండెపోటుతో ఆయన కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.




















