ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్. ఇస్మాయిల్‌కు 'వైల్డ్‌లైఫ్ క్రైమ్ డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్' విభాగంలో ఎన్‌టీసీఏ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. వన్యప్రాణులపై జరిగే నేరాలను గుర్తించడం, సమగ్ర దర్యాప్తు చేపట్టడం, నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా వ్యవహరించినందుకు ఈ పురస్కారం అందించారు.
అదే విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జి. సుధాకరరావుకు పీపుల్స్ పార్టిసిపేషన్ అండ్ ఈకో డెవలప్‌మెంట్ యాక్టివిటీస్' విభాగంలో ఎన్‌టీసీఏ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు. స్థానిక గిరిజన సమాజాన్ని అటవీ సంరక్షణలో భాగస్వాములను చేయడం, వన్యప్రాణులకు అమర్చిన ఉచ్చులను తొలగించడం, సంరక్షణ కార్యక్రమాలకు సహకరించడం, పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.
కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాలను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. అటవీ శాఖలో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ సిబ్బంది అంకితభావం, ధైర్యసాహసాలు, నిబద్ధతకు ఈ అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ అభినందనలు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరు అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు, నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు.. పులుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను పరిరక్షించే దిశగా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




















