పశ్చిమగోదావరి,సెప్టెంబర్ 01 (జనవాణి): ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ‘‘31 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాను. నేను పేదలకు భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. ఒక్కప్పుడు వృద్దులంటే కుటుంబ సభ్యులు భారంగా చూసేవారు. ఇప్పుడు వృద్దులంటే కుటుంబ సభ్యులు గౌరవంగా చూస్తున్నారు. ఆ గౌరవాన్ని ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వం. మహిళల సాధికారత, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వీలైనంత త్వరలో రాష్ట్రం మొత్తం ఏసీ బస్సులు వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో ఉచితంగా తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆడబిడ్డకు చదువు, ఉద్యోగం ఉండాలనేది నా ఆలోచన... మహిళలు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లుగా కూడా మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మహిళలు డ్రైవింగ్ రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు.
స్త్రీ శక్తి పథకానికి భారీ స్పందన
2025 ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎంపిక చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతోంది. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రత్యేక ఆలయ బస్సు సర్వీసుల్లోనూ ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన ఏడాది కాలంలో మహిళలు 87 కోట్ల ప్రయాణాలు చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రోజుకు సుమారు రూ.8.53 కోట్లను ఆర్టీసీకి సబ్సిడీగా అందిస్తోంది. ఏడాది కాలంలో ఇప్పటివరకు సుమారు రూ.3,095 కోట్లు ఖర్చు చేసింది.
పెరిగిన మహిళా ప్రయాణికులు
స్త్రీ శక్తి పథకం అమల్లోకి రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా సుమారు 40 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 62 శాతానికి చేరింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 9.47 లక్షల నుంచి 24 లక్షలకు పెరిగింది. మొత్తం 9,978 ఆర్టీసీ బస్సుల్లో 7,631 బస్సులను స్త్రీ శక్తి పథకం కోసం వినియోగిస్తున్నారు. ఈ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా 93 శాతానికి చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో.. ఏసీ బస్సుల్లోనూ ఇదే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తే మహిళలకు మరింత ప్రయోజనం కలగనుంది.




















