హైదరాబాద్, ఆగస్టు 17 (జనవాణి): టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం సూర్యతేజతో హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
కుమార్తె వివాహం అనంతరం బండ్ల గణేష్ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. జనని వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వేడుకకు వచ్చిన పెద్దలు, ఆత్మీయులు, సినీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి రాకతో తమ ఇంట్లో జరిగిన వేడుక మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. అతిథులు అందించిన ప్రేమ, ఆశీర్వాదాలు తమ కుటుంబానికి జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని బండ్ల గణేష్ తెలిపారు. మీ ప్రేమ, అభిమానం, ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ బండ్ల గణేష్ 'X' వేదికగా పేర్కొన్నారు.
అదే సమయంలో భారీ స్థాయిలో నిర్వహించిన వివాహ వేడుకలో ఏవైనా లోటుపాట్లు లేదా అసౌకర్యాలు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని ఆయన కోరారు. అతిథుల పట్ల బండ్ల గణేష్ చూపించిన ఈ వినయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
Loading Tweet...




















