సినిమాల్లో నటుడిగా, కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ.. రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రయాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి రావాలనేది తన మొదటి ఆలోచన కాదని అలీ తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో 1999లో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల పాటు టీడీపీకి మద్దతుగా పనిచేశానని, అన్నేళ్లు ఆ పార్టీలో ఉంటే.. ఎంపీనో, ఎమ్మెల్యేనో, ఎట్‌లీస్ట్ ఎమ్మెల్సీనో కావాలి కదా. కానీ 20 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే.. కనీసం తగిన గుర్తింపు ఇవ్వకుండా ఐదేళ్లకోసారి తనను ఉపయోగించుకుని పక్కన పెట్టారని అలీ ఆవేదన వ్యక్తం చేశారు.
కూరలో కరివేపాకులా తీసిపారేశారు
తనకు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఒక వర్గానికి చెందిన వ్యక్తిననే కారణంతో కూరలో కరివేపాకులా తీసి పక్కన పెట్టారని అలీ వ్యాఖ్యానించారు. పార్టీ కోసం తన సినిమా పనులను, ఆదాయాన్ని సైతం పక్కనపెట్టి క్యాంపెయినింగ్ చేశానని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ బాధను అనుభవించానని.. చివరకు ఇక రాజకీయాలు వద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వైసీపీలోనూ అదే పరిస్థితి
2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన అలీ.. 2022లో ఆ పార్టీలో అధికారికంగా చేరారు. అదే ఏడాది ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నామినేటెడ్ పదవి కూడా దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అవి ప్రచారాలుగా మిగిలిపోయాయి. గుంటూరు, రాజమండ్రి, నంద్యాల వంటి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. వైసీపీలోకి వెళ్లిన తర్వాత కూడా తనకు దాదాపు అదే పరిస్థితి ఎదురైందని అలీ తెలిపారు. దీంతో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
నాకు ఫుడ్ పెట్టింది సినిమానే
తన జీవితానికి సినిమానే ఆధారమని అలీ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు తనకు ఆహారం పెట్టలేదని.. సినిమాలను నమ్ముకున్నందుకే ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
మన పనులను, ఆదాయాన్ని మానుకుని పార్టీల కోసం పనిచేస్తే పట్టించుకోకపోతే బాధ ఉంటుంది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ బాధ నేను చాలా చూశాను.. దాదాపు 20 ఏళ్లు పాటు బాధ పడ్డాను. ఆ తరువాత పడింది చాలు ఇక వద్దు అనుకున్నా ఇక రాజకీయాలు వద్దని నిర్ణయించుకుని పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినట్లు అలీ వెల్లడించారు.




















