రూ.57 లీటరు పాలకు రూ.76.26.. ఎమ్మార్పీ కంటే 30 శాతం అధిక ధరతో కొనుగోలు.. కస్తూర్బా విద్యాలయాల టెండర్లలో అక్రమాలపై సీపీఐ ధ్వజం

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు వస్తువుల కొనుగోళ్ల కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. మార్కెట్‌ ధరలు, గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే 30 నుంచి 40 శాతం అధిక ధరలకు టెండర్లను ఆమోదించారని పేర్కొన్నారు

11 ఆగస్టు, 2026 5:37 PM•ByRalin

Share this article

రూ.57 లీటరు పాలకు రూ.76.26.. ఎమ్మార్పీ కంటే 30 శాతం అధిక ధరతో కొనుగోలు.. కస్తూర్బా విద్యాలయాల టెండర్లలో అక్రమాలపై సీపీఐ ధ్వజం

అమరావతి, ఆగస్టు 11 (జనవాణి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు వస్తువుల కొనుగోళ్ల కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. మార్కెట్‌ ధరలు, గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే 30 నుంచి 40 శాతం అధిక ధరలకు టెండర్లను ఆమోదించారని పేర్కొన్నారు. ఈ టెండర్లను రద్దు చేసి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు.

ఆహార సామగ్రి కొనుగోళ్లలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు కాంట్రాక్టులు ఖరారు చేశారని సీపీఐ ఆరోపించింది. సాధారణంగా ప్రభుత్వం భారీగా వస్తువులను కొనుగోలు చేస్తే మార్కెట్‌ ధర కంటే తక్కువకు లభించాల్సి ఉండగా.. ఇక్కడ సాధారణ వినియోగదారులు చెల్లించే ధర కంటే కూడా అధికంగా చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని పేర్కొంది.

ఒక్కో వస్తువుపై భారీ వ్యత్యాసం

విచారణ కమిటీ సేకరించిన కాస్టింగ్‌ షీట్‌ ప్రకారం.. హెల్త్‌ బెవరేజ్‌ కిలో/లీటర్‌ ధర మార్కెట్‌లో రూ.380 ఉండగా టెండర్‌లో రూ.533.82కు ఆమోదించారని, అంటే రూ.153.82 అధికంగా చెల్లిస్తున్నారని సీపీఐ తెలిపింది. కారం పొడి మార్కెట్‌ ధర రూ.300 ఉండగా రూ.492కు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.171 ఉండగా రూ.200.49కు, గోధుమ పిండి రూ.42 ఉండగా రూ.68.88కు, పాల ధర రూ.57 ఉండగా రూ.76.26కు ఆమోదించారని పేర్కొంది.

కేవలం 10 నెలల కాంట్రాక్టు కాలానికే ఈ స్థాయిలో అధిక ధరలు నిర్ణయించడం వల్ల సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైనట్లు ప్రాథమిక విశ్లేషణలు చెబుతున్నాయని సీపీఐ పేర్కొంది.

జోన్‌-1లో 1,36,800 లీటర్ల పాలకు లీటరుకు రూ.19.26 అదనంగా లెక్కించి రూ.26.34 లక్షల మేర అదనపు చెల్లింపులకు అవకాశం కల్పించారని ఆరోపించింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కొనుగోళ్లలో 13,680 కిలోలకు కిలోకు రూ.29.49 అధికంగా చెల్లించడం ద్వారా రూ.4.02 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది.

నలుగురు కాంట్రాక్టర్లకే లబ్ధి?

టెండర్‌ నిబంధనల్లో 20 వేల చదరపు అడుగుల గోడౌన్‌, 20 వాహనాలు ఉండాలనే నిబంధనలు పెట్టడం ద్వారా చిన్న వ్యాపారులు పోటీ నుంచి తప్పుకునేలా చేశారని సీపీఐ ఆరోపించింది. దీంతో కేవలం నలుగురు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొని, సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచారని పేర్కొంది.

టెండర్లలో అక్రమాలపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి విచారణ కమిటీ కూడా పలు అంశాలను గుర్తించిందని సీపీఐ తెలిపింది. మార్కెట్‌ ధరల కంటే భారీగా ఉన్న టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని, బాధ్యులైన అధికారులు, టెండర్‌ కమిటీ సభ్యులపై శాఖాపరమైన, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు పేర్కొంది.

కేంద్రీకృత విధానంతో చిన్న వ్యాపారులకు నష్టం

గతంలో స్థానికంగా నిర్వహించే వికేంద్రీకృత కొనుగోళ్ల విధానాన్ని రద్దు చేసి, నాణ్యతా ప్రమాణాల పేరుతో కేంద్రీకృత టెండర్ల విధానాన్ని తీసుకొచ్చారని సీపీఐ ఆరోపించింది. ఈ విధానం వల్ల స్థానిక చిన్న వ్యాపారులు టెండర్లలో పాల్గొనే అవకాశం కోల్పోయి, పెద్ద సంస్థలకే కాంట్రాక్టులు దక్కే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

టెండర్‌ డాక్యుమెంట్లలో అంచనా వ్యయాన్ని మార్కెట్‌ ధరల కంటే ఎక్కువగా చూపించి, కాంట్రాక్టర్లు అంతకంటే అధిక ధరలు కోట్‌ చేసినప్పటికీ ‘ఎల్‌-1’ పేరుతో ఆమోదించారని సీపీఐ ఆరోపించింది. నిబంధనలను కఠినతరం చేసి నలుగురు పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చారని పేర్కొంది.

టెండర్లను తక్షణమే రద్దు చేసి.. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు