జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించిన మేఘన.. తనకు భద్రత కల్పించాలని, కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

10 సెప్టెంబర్, 2026 5:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

విజయవాడ,సెప్టెంబర్ 10 (జనవాణి): మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబంలో వివాదం మరింత ముదిరింది. తన అత్తమామలు జోగి రమేష్, శకుంతల, భర్త రాజీవ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన కోడలు మేఘన ఆరోపించారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

మేఘన తన తండ్రి అనంతకృష్ణగౌడ్‌తో కలిసి విజయవాడలోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రూ.5 కోట్ల అదనపు కట్నం కోసం వేధింపులు?

పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు భారీగా ఖర్చు చేశారని మేఘన తెలిపారు. రూ.5 కోట్లు ఖర్చు చేయడంతో పాటు 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, రూ.9 లక్షల ఆడపడుచు కట్నంగా ఇచ్చామని పేర్కొన్నారు. అయితే వివాహం జరిగిన కొంతకాలానికే అదనంగా రూ.5 కోట్ల కట్నం, ఖరీదైన కార్లు, వజ్రాల నెక్లెస్, వజ్రపు ఉంగరం తీసుకురావాలని అత్తమామలు వేధించారని ఆరోపించారు. అంతేకాకుండా తనను చంపేందుకు ప్రయత్నించారని మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలో తనకు ఈత రాదని తెలిసినా భర్త రాజీవ్ పడవపై నుంచి నీటిలోకి నెట్టేందుకు ప్రయత్నించారని, ఘట్‌కేసర్ ఫాంహౌస్‌లో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేయాలని చూశారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని ఇంటి టెర్రస్‌పై నుంచి కిందకు తోసేయడానికి ప్రయత్నించారని కూడా పేర్కొన్నారు. తనపై జరిగిన వేధింపులకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే పోలీసులకు అందజేశానని మేఘన తెలిపారు. ఇది భార్యాభర్తల మధ్య సాధారణ మనస్పర్థల వ్యవహారం కాదని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర అని ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

మేఘన ఆరోపణలపై జోగి రమేష్ ఏమన్నారు?

మరోవైపు, గతంలో మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ తన కోడలు మేఘనను సొంత కుమార్తెలా చూసుకున్నామని తెలిపారు. రాజీవ్, మేఘన మధ్య విభేదాల కారణంగా తమ కుటుంబంలోని 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఈ కేసులో తాము ముందస్తు బెయిల్ తీసుకున్నామని వెల్లడించారు. కుటుంబ వివాదాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. రాజీవ్, మేఘనల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానళ్లు అతిగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఫేక్ ఆడియోలు, వీడియోలు సృష్టించి తమ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అయితే, జోగి రమేష్ కుటుంబం తనను మోసం చేస్తూనే ఉందని మేఘన మరోసారి ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లోనే అసలు వాస్తవాలను పొందుపరిచానని, తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేశానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను ఆశ్రయించిన మేఘనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు