మా అత్తయ్య పెట్టింది గోరుముద్దలు కాదు, విషపుముద్దలు..జోగి రమేశ్ కోడలు మేఘన సంచలన వాఖ్యలు

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త రాజీవ్ సమస్యలు తెలిసి కూడా తనకు వివాహం జరిపించారని, పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని మేఘన తెలిపారు.

25 ఆగస్టు, 2026 9:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మా అత్తయ్య పెట్టింది గోరుముద్దలు కాదు, విషపుముద్దలు..జోగి రమేశ్ కోడలు మేఘన సంచలన వాఖ్యలు

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త రాజీవ్‌కు ఉన్న సమస్యలు తెలిసి కూడా తనకు వివాహం జరిపించారని ఆరోపించారు. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు తనను జోగి రమేశ్ కుటుంబం మోసం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. సోమవారం జోగి రమేశ్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లోని ప్రతి ఆరోపణకు ఆధారాలున్నాయి

తనపై జరిగిన వేధింపులు, ఇబ్బందులకు సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు అందజేశానని మేఘన చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని ప్రజల ముందుంచుతానని తెలిపారు. తన వద్ద వీడియోలు కూడా ఉన్నాయని, అవసరమైన సమయంలో మరిన్ని ఆధారాలను బయటపెడతానని అన్నారు.

క్రైస్తవంలోకి రావాలని చెప్పేవారు

తన పుట్టింటివారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని మేఘన తెలిపారు. పెళ్లైన నెలకే ఆషాఢం వచ్చిందని, అదనపు కట్నం తెస్తేనే తాను సంతోషంగా ఉంటానని అత్త చెప్పినట్లు ఆరోపించారు. పెళ్లికి ముందు జోగి రమేశ్ కుటుంబం తమను హిందువులుగా పరిచయం చేసుకుందని, పెళ్లైన తర్వాత వారు క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందని చెప్పారు. ఇంట్లో హిందూ పూజలు జరిగేవి కావని, పూజ గది కూడా లేదని మేఘన ఆరోపించారు. క్రైస్తవ మతాన్ని పాటించడం తనకు అభ్యంతరం కాదని, అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి పెళ్లి చేయడమే తప్పని అన్నారు. హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవంలోకి రావాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

గోరుముద్దలు కాదు.. విషపుముద్దలు

తన భర్తకు ఉన్న సమస్యలు తెలిసి కూడా అత్తయ్య ఈ పెళ్లి చేశారని మేఘన ఆరోపించారు. ‘మా అత్తయ్య నాకు పెట్టింది గోరుముద్దలు కాదు.. విషపుముద్దలు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో తెలిపే వీడియోలు, ఇతర ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

సజ్జల వద్దకు వెళ్లాలని సూచించారు

తమకు జరిగిన అన్యాయంపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను కలిసినట్లు మేఘన తెలిపారు. న్యాయం కోసం ఆయనను కలిశానని చెప్పారు. అనంతరం పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు మేఘన వెల్లడించారు. కేసు పెట్టకుండా తమ లాయర్ ద్వారా మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నించారని, సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు మేఘన తెలిపారు. రాజీ చేసుకోవాలని సజ్జల సూచించారని, తాను అండగా ఉంటానని, న్యాయం చేస్తానని చెప్పారని పేర్కొన్నారు. అయితే సమస్య పరిష్కారానికి బదులుగా కాలయాపన మాత్రమే జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు కూడా ప్రయత్నించానని, కానీ అవకాశం దక్కలేదని చెప్పారు.

పెళ్లైన రెండు నెలలకే విడాకుల పిటిషన్‌

తన భర్త రాజీవ్ పెళ్లైన రెండు నెలలకే తనపై ‘నల్ అండ్ వాయిడ్’ కేసు వేశారని మేఘన తెలిపారు. అదే సమయంలో విడాకుల కోసం కూడా పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. రాజీవ్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. తనను వదిలించుకునేందుకు అనేక కట్టుకథలు చెప్పారని మేఘన ఆరోపించారు. కుమారుడికి చికిత్స చేయించాల్సి ఉందని చెప్పి తనను పుట్టింటికి పంపించారని తెలిపారు. ఎలాంటి తప్పు చేయకపోయినా గత ఏడాదిన్నరగా తాము మానసిక క్షోభ అనుభవిస్తున్నామని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు