న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనవాణి): నంద్యాల పార్లమెంట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంపై ఎంపీ బైరెడ్డి శబరి దృష్టి సారించారు. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బుధవారం న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లా ప్రజల భద్రత, సౌకర్యం, మెరుగైన రవాణా కనెక్టివిటీకి సంబంధించిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో చేపట్టాల్సిన కీలక మౌలిక వసతుల పనులను త్వరితగతిన మంజూరు చేసి పూర్తి చేయాలని కోరారు.
బొల్లవరం, కరివేన, ఆత్మకూరు–సిద్ధపల్లె జంక్షన్ వద్ద అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రిని కోరారు. ఆయా ప్రాంతాల్లో రహదారి దాటే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రమాదాల నేపథ్యంలో అండర్‌పాస్‌లు అవసరమని వివరించారు. పారుమంచాల వద్ద మీడియన్ ఓపెనింగ్ ఏర్పాటు చేయడంతో పాటు డిపాల్ స్కూల్ సమీపంలో విద్యార్థులు, స్థానిక ప్రజల రాకపోకలకు అనువుగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
భానుముక్కల, ఇస్కాల గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కూడా గడ్కరీని కోరినట్లు ఎంపీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులకు వర్షం, ఎండ నుంచి రక్షణ కల్పించడంతో పాటు ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు బస్ షెల్టర్లు అవసరమని వివరించారు.
అలాగే NH-340C పరిధిలోని ఆత్మకూరు–దోర్నాల రహదారి, NH-544D పరిధిలోని బుగ్గ–కైప–గిద్దలూరు రహదారులకు సంబంధించిన డీపీఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు బైరెడ్డి శబరి వెల్లడించారు. ఈ రహదారుల అభివృద్ధి పూర్తయితే నంద్యాల పార్లమెంట్ పరిధిలో రవాణా కనెక్టివిటీ మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు పెరుగుతాయని తెలిపారు.
నంద్యాల జిల్లా అభివృద్ధి, ప్రజల భద్రత, రవాణా సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ సంబంధిత అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.





















