ఉప్పాడ తీరానికి కవచం.. రూ.323 కోట్లతో రక్షణ గోడ, ఐఐటీ-మద్రాస్‌తో ఒప్పందం

సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి రక్షణ కల్పించేందుకు రూ.323 కోట్లతో తీర రక్షణ గోడ నిర్మించనున్నారు. డిజైన్‌, డీపీఆర్‌, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ-మద్రాస్‌ చేపట్టనుంది.

12 ఆగస్టు, 2026 7:33 PM•ByRalin

Share this article

ఉప్పాడ తీరానికి కవచం.. రూ.323 కోట్లతో రక్షణ గోడ, ఐఐటీ-మద్రాస్‌తో ఒప్పందం

ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంగళగిరి, ఆగస్టు 12 (జనవాణి): సముద్ర కోతతో ఏటా వెనక్కి జరుగుతున్న ఉప్పాడ తీరానికి రక్షణ కల్పించే దిశగా కీలక అడుగు పడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్‌, సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్టు (DPR), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ-మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (NDMF) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్‌ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ప్రాజెక్టు ద్వారా సముద్ర కోత ప్రభావాన్ని తగ్గించి ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

తీర రక్షణ నిర్మాణం శాస్త్రీయంగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా ఐఐటీ-మద్రాస్‌ నిపుణులు అధ్యయనం చేయనున్నారు. ఉప్పాడ తీరంలో సముద్ర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి.. వాటి ఆధారంగా రక్షణ గోడ డిజైన్‌ను రూపొందించనున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతిక పర్యవేక్షణలోనూ ఐఐటీ-మద్రాస్‌ కీలక పాత్ర పోషించనుంది.

నవంబర్‌ నుంచి పనులు

ఐఐటీ-మద్రాస్‌తో ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో నవంబర్‌ నుంచి తీర రక్షణ గోడ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సముద్ర కోత కారణంగా తీర ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఉప్పాడ పరిసర మత్స్యకార గ్రామాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ శరవణన్‌, పాడా డైరెక్టర్‌ డా. ఎన్‌.వి. శివరామ ప్రసాద్‌, ఐఐటీ-మద్రాస్‌ ఓషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎస్‌.ఎ. సన్నాసిరాజ్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖతీబ్‌ కౌసర్‌ బానో, ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డు చీఫ్‌ ఇంజనీర్‌ జి.వి. రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు