పిఠాపురం, ఆగస్టు 7 (జనవాణి): ఏపీ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, ఎవరికైనా కష్టం వస్తే ముందుండి ఆదుకుంటున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు మల్లారపు అబ్బులుకు రూ.6 లక్షల ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కును శుక్రవారం ఆయన అందజేశారు. ప్రజల సంక్షేమమే పవన్ కల్యాణ్ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవాల్లో నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత రంగానికి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు అండగా నిలుస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను వినియోగించి సంప్రదాయ చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులను సన్మానించి వారి సేవలను కొనియాడారు.
అంతకుముందు "మన పిఠాపురం – మన గ్రీన్ భవిష్యత్తు" నినాదంతో చేపట్టిన గ్రీన్ పిఠాపురం కార్యక్రమానికి నాగబాబు శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని సూచించారు. పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పచ్చని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తర్వాత కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ గ్రామంలో నిర్వహించిన అగ్నికుల క్షత్రియ జాతిపితామహుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 152వ జయంతి వేడుకల్లో నాగబాబు పాల్గొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హారేంద్ర ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ, విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, అగ్నికుల క్షత్రియుల సామాజిక, విద్యా అభ్యున్నతికి పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజ అభివృద్ధికి ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.





















