పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ.. పిఠాపురంలో రహదారులకు మహర్దశ

పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూ.207 కోట్ల వ్యయంతో 307 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటికే 611 రోడ్లు పూర్తవగా, మరో 70 పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

5 ఆగస్టు, 2026 10:26 PM•ByLaharika

Share this article

పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ.. పిఠాపురంలో రహదారులకు మహర్దశ

పిఠాపురం, ఆగస్టు 5 (జనవాణి): పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానం కల్పిస్తూ రూ.207 కోట్లతో 307 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 611 రోడ్ల నిర్మాణం పూర్తికాగా, మరో 70 రోడ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి కొత్త దారి పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గ్రామాల అవసరాలకు అనుగుణంగా..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో చేపట్టిన రహదారుల నిర్మాణంలో ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బడి, గుడి, ఆసుపత్రులు, వ్యవసాయ పొలాలు, తీర ప్రాంత మత్స్యకార కాలనీలను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎక్కువగా కోరిన రోడ్ల సమస్యల పరిష్కారంపైనే ప్రత్యేక దృష్టి సారించారు.

మత్స్యకార కాలనీలకు కొత్త ఊపిరి

ఉప్పాడ తీర ప్రాంతంలోని మాయాపట్నం, కొత్తసూరాడపేట పునరావాస కాలనీల్లో దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. కొత్త మాయాపట్నంలో రూ.1.52 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించగా, కొత్తసూరాడపేటలో రూ.93 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసి ప్రధాన రహదారితో అనుసంధానం చేశారు. దీంతో వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయాయని స్థానికులు చెబుతున్నారు.

తుపాన్లతో దెబ్బతిన్న రహదారులకు పునర్జన్మ

యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి–రామన్నపాలెం బీచ్ రహదారిని రూ.88 లక్షలతో పునర్నిర్మించారు. గతంలో తుపాన్లు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఈ రోడ్డు పునరుద్ధరణతో గ్రామస్తులు, భక్తులు, మత్స్యకారులకు ప్రయాణం సులభమైంది. అలాగే ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ.79.70 లక్షలతో శాశ్వత రహదారి నిర్మించారు.

కొండెవరం ప్రజలకు భారీ ఊరట

ఏడేళ్లుగా దెబ్బతిన్న కొండెవరం–ఉప్పాడ ప్రధాన రహదారిని రూ.1.22 కోట్లతో పునర్నిర్మించారు. ఈ రహదారి ద్వారా సుమారు 8 వేల మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. పంటల రవాణా నుంచి విద్యార్థుల ప్రయాణం వరకు అన్ని అవసరాలకు ఈ రోడ్డు కీలకంగా మారింది.

గుంతల రోడ్లకు గుడ్‌బై

వెన్నెపూడి, తాటిపర్తి, కొడవలి, చిత్రాడ తదితర గ్రామాల్లో పాడైన రహదారులను కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారు. చిత్రాడ ఈబీసీ కాలనీలో రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.50 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించారు.

రైతు కోసం డొంక రోడ్లు

'పల్లెపండుగ 2.0' కార్యక్రమంలో భాగంగా రైతుల కోసం ప్రత్యేకంగా డొంక రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. పి.రాయవరం, బి.ప్రత్తిపాడు ప్రాంతాల్లో దాదాపు రూ.కోటి వ్యయంతో మూడు కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్లు నిర్మించారు. దీంతో 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడింది.

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

నియోజకవర్గంలో కొనసాగుతున్న రహదారి పనులపై సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మిగిలిన 70 రోడ్ల నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా రహదారులు నిర్మించాలని స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు