తిరుపతి శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్‌ పేలుడుతో ఐదుగురుకు పైగా కార్మికులు మృతి

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్‌ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తాజా సమాచారం. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ, పోలీసు, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

3 అక్టోబర్, 2026 12:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తిరుపతి శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్‌ పేలుడుతో ఐదుగురుకు పైగా కార్మికులు మృతి

తిరుపతి, అక్టోబర్ 3 (జనవాణి): తిరుపతి జిల్లా శ్రీసిటీ పారిశ్రామికవాడలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సత్యవేడు మండలం శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలడంతో పలువురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని నిర్మాణాలు దెబ్బతినడంతోపాటు భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ప్రమాద సమయంలో నైట్‌ షిఫ్ట్‌ కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చేపట్టారు.

తాజా నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా పది మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రమాదంలో మృతులుగా గౌరబ్‌ రాయ్‌ (35), చిన్న మస్తాన్‌ (36), రమేష్‌ (40)ను అధికారులు గుర్తించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వాసు (36) చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

పేలుడు ధాటికి పరిశ్రమలోని శకలాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడినట్లు సమాచారం. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. బాయిలర్‌లో సాంకేతిక లోపమా మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి, పలువురు గాయపడటం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, పేలుడుకు ఖచ్చితమైన కారణం ఏమిటి, భద్రతా ప్రమాణాలు పాటించారా వంటి అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై అధికారికంగా తుది వివరాలు వెల్లడైన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు