తిరుమల, అక్టోబర్ 6 (జనవాణి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు దర్శన ఏర్పాట్లను సజావుగా నిర్వహించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, డిఫెన్స్ సిబ్బంది దర్శనాలను కూడా ఈ పది రోజులపాటు నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
అక్టోబర్ 7న రూ.300 దర్శనం టికెట్లు
నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ టికెట్లను టీటీడీ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ (https://ttdevasthanams.ap.gov.in/)ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించింది. అనధికారిక వెబ్‌సైట్లు, వ్యక్తుల ద్వారా టికెట్లు పొందేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలపై మరో కీలక ప్రకటన
అక్టోబర్ 10 నుంచి 19వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులు తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. దర్శనంతో పాటు వసతి, ప్రయాణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.




















