తిరుమల, సెప్టెంబర్ 03 (జనవాణి): తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ ఆస్తుల కేసులో భాగంగా ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రాంగణాల్లో ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి తిరుపతిలోని లోకనాథం నివాసం, బంధువుల ఇల్లు, ఏర్పేడులోని పూర్వీకుల ఇల్లు, తిరుమలలోని ఆయన అధికారిక కార్యాలయంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఆస్తి పత్రాలు, బంగారం, వెండి, నగదుతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
రూ.5 కోట్ల ఆస్తులు.. బంగారం, వెండి స్వాధీనం
ఏసీబీ సోదాల్లో లోకనాథం ఇంట్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులు, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న కొన్ని ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను కూడా అధికారులు పరిశీలించారు.
ఇవీ గుర్తించిన ఆస్తులు
తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో భార్య పేరుతో ఉన్న ఇల్లు
గొల్లవానిగుంటలో రెండు ఇంటి స్థలాలు, ఒక భవనం
వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం గ్రామంలో ఇంటి స్థలం
శ్రీనివాసాపురం నివాస ప్రాంతంలో కుమారుడి పేరుతో ఉన్న స్థలం
బంధువుల పేర్లతో ఉన్న నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్లు
లడ్డూ నెయ్యి వ్యవహారంతో లింకులు?
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంపై జరిగిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా లోకనాథం వ్యవహారంపై ఏసీబీ దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్రకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. మరికొందరి పాత్రపైనా అనుమానాలు వ్యక్తం కావడంతో విచారణ జరపాలని ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నెయ్యి సరఫరాదారులను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కె. చిన్న అప్పన్నపై ఏసీబీ విశాఖపట్నం విభాగం కేసు నమోదు చేసింది. ఈ దర్యాప్తు కొనసాగింపులో భాగంగానే లోకనాథం వ్యవహారంపై కూడా ఏసీబీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానం
లోకనాథం 1989 ఫిబ్రవరి 1న కారుణ్య నియామకం కింద టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ హోదాల్లో పనిచేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి చేరుకున్నారు.
అరెస్ట్ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి లోకనాథంను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచే ప్రక్రియను అధికారులు చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తులపై ఏసీబీ దర్యాప్తులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.




















