30 ఏళ్ల నిరీక్షణకు తెర..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు. నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతించిన సీఎం.. అనంతరం నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.

31 ఆగస్టు, 2026 5:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

30 ఏళ్ల నిరీక్షణకు తెర..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగు

ఆంద్రప్రదేశ్, ఆగస్టు 31 (జనవాణి): మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

తెలుగు సంప్రదాయ పంచెకట్టుతో కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వచ్చిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. కృష్ణా జలాలకు పసుపు, కుంకుమలు సమర్పించారు. అనంతరం పవిత్ర జలాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులపై చల్లి ఆనందాన్ని పంచుకున్నారు. ఫీడర్ కాలువ వద్ద ప్రవహిస్తున్న కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా తరలించిన కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల గుండా గంటవానిపల్లె అక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ వైపు పరుగులు తీశాయి. కృష్ణమ్మకు స్థానిక మహిళలు, ప్రజలు పుష్పాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం స్విచ్ నొక్కి నీటిని దిగువకు విడుదల చేశారు.

30 ఏళ్ల క్రితం భూమిపూజ.. నేడు ప్రారంభం

వెలిగొండ ప్రారంభోత్సవం తన జీవితంలో అత్యంత భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న తానే ముఖ్యమంత్రిగా వెలిగొండకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026 ఆగస్టు 31న తొలి దశను ప్రారంభిస్తున్నానని తెలిపారు. ఆ రోజు చేసిన సంకల్పం.. ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారింది. ఇది భగీరథ ప్రయత్నం. కొండలు అడ్డొచ్చినా వాటిని తొలిచి ముందుకు వెళ్లాం. కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం అని చంద్రబాబు అన్నారు. వెలిగొండతో మార్కాపురం ప్రాంతానికి కొత్త భవిష్యత్తు ప్రారంభమవుతుందని, కరువుతో పోరాడిన రైతులు, ఫ్లోరైడ్ బాధలు ఎదుర్కొన్న కుటుంబాలకు కృష్ణా జలాలు కొత్త ఊపిరి ఇస్తాయని చెప్పారు.

AP CM

11 గ్రామాల నిర్వాసితులకు పరిహారం

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు చంద్రబాబు పాదాభివందనం చేశారు. నిర్వాసితుల త్యాగం లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మరో రూ.169 కోట్లు అదనంగా చెల్లిస్తున్నామని తెలిపారు. కటాఫ్ తేదీని పెంచి 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందించినట్లు చెప్పారు.

తొలి దశతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు

రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి తొలి దశను పూర్తి చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. తొలి దశలో 18.8 కిలోమీటర్ల జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తయ్యాయని తెలిపారు. నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తరలించి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందిస్తామని చెప్పారు. వెలిగొండ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు.

AP CM

2028 నాటికి ఫేజ్-2 పూర్తి

వెలిగొండ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ఫేజ్-2ను 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని, రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌లో మార్కాపురాన్ని భాగం చేశామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

2028 కృష్ణా పుష్కరాలు మార్కాపురంలోనూ

2028లో జరిగే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో నీటి సమస్యలకు నదుల అనుసంధానమే పరిష్కారమని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. గోదావరి జలాలను అనకాపల్లి మీదుగా వంశధార వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని తెలిపారు. ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి భూగర్భజలంగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు.

సంప్రదాయ పంచెకట్టులో ఉత్సాహంగా చంద్రబాబు

వెలిగొండ ప్రారంభోత్సవంలో చంద్రబాబు సంప్రదాయ పంచెకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో కృష్ణా జలాలకు స్వాగతం పలికారు. సభా వేదికపై రైతులు, ప్రజలకు కండువా తిప్పుతూ అభివాదం చేశారు. దివంగత పూల సుబ్బయ్య కుటుంబ సభ్యులను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి సన్మానించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులతో పాటు జల వనరుల శాఖ మంత్రి రామానాయుడును ప్రత్యేకంగా అభినందించారు. ఓట్ల కోసం కాదు.. మార్పు కోసం పనిచేస్తున్నాం. ఎన్నికల కోసం కాదు.. ప్రజల జీవితాలను మార్చేందుకు, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

AP CM

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు