విజయవాడ, సెప్టెంబర్ 7 (జనవాణి): మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించబోతున్న కొత్త పార్టీకి మేనిఫెస్టో ప్రకటించారు. ఐదు అంశాలే తమ మేనిఫెస్టోగా ప్రకటించారు. జెన్-జీకి 66 శాతం సీట్లు, రైతులకు,గృహావసరాలకు ఉచిత కరెంటు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
యువతకు 66 శాతం రాజకీయ ప్రాతినిధ్యం
కొత్త పార్టీలో 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువతకు 66 శాతం సీట్లు కేటాయిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. కులాలకు అతీతంగా ప్రతిభ, సామర్థ్యం ఉన్న యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇందులో యువ మహిళలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మిగిలిన 34 శాతం సీట్లను అనుభవజ్ఞులైన సీనియర్లకు కేటాయిస్తామని వెల్లడించారు.
ప్రతి ఇంటికీ, రైతులకు ఉచిత విద్యుత్
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచి ఆంధ్రప్రదేశ్‌ను సోలార్ రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై భారం లేకుండా కేంద్ర, రాష్ట్ర సబ్సిడీలతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి, రైతులకు ఉచిత విద్యుత్ అందించే విధానం తీసుకొస్తామని చెప్పారు. పరిశ్రమలు మినహా మిగతా వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించాలన్నది తమ లక్ష్యమన్నారు.
పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులను తగ్గించి పెట్రోల్ ధరను రూ.100 లోపే ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆదాయం పెరగడం కోసం అవసరమైతే రాష్ట్ర ఆదాయాన్ని కొంత కోల్పోయినా పన్నుల భారాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు.
నీటి నిల్వ సామర్థ్యం 3,000 టీఎంసీలకు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నీటి నిల్వ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచి 3,000 టీఎంసీలకు తీసుకెళ్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. భారీగా సముద్రంలో కలుస్తున్న నీటిని రిజర్వాయర్లకు మళ్లించి సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించాలని అన్నారు. వరుసగా రెండుమూడేళ్లు కరువు వచ్చినా రైతులు, ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.
విద్య-ఉద్యోగాలకు ప్రాధాన్యం
యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు లేని కోర్సులను పునఃసమీక్షించి, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. టీచర్లపై అదనపు పనిభారం తగ్గించి, వారిని బోధనకే పరిమితం చేస్తామని తెలిపారు. టీచర్ నియామకాల్లో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ టీచింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీపీఎస్సీ తరహాలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతామని చెప్పారు.
నిరుద్యోగులకు ‘గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్’
యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన నిరుద్యోగులకు నిర్ణీత కాలం పాటు ఆర్థిక సహాయం అందించేలా గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్ తీసుకొస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. నాలుగేళ్లు లేదా ఐదేళ్లపాటు ఈ సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
అమరావతిపై విజయసాయిరెడ్డి క్లారిటీ
అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేసిన నేపథ్యంలో రాజధానిని మార్చడం అవివేకమని అభిప్రాయపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు.
అప్పులు, నిత్యావసరాల ధరలపై ఫోకస్
రాష్ట్ర ప్రజల్లో అధిక శాతం మంది ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటంతో అప్పుల్లో చిక్కుకుంటున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజల ఖర్చులు తగ్గించి, ఆదాయ వనరులు పెంచే విధానాలపై తమ పార్టీ దృష్టి పెడుతుందని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం కూడా తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు.
త్వరలో అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి పార్టీ విధానాలను వెల్లడిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. అనంతరం కాన్‌క్లేవ్ నిర్వహించి పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తామని చెప్పారు. విజయదశమి తర్వాత కొత్త పార్టీని స్థాపించే అవకాశం ఉందని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీగా ఉంటుందని వెల్లడించారు.




















