విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం.. జలమయమైన రోడ్లు, అప్రమత్తమైన అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం రావాల్సిన ఇండిగో విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు. మరోవైపు దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.

12 సెప్టెంబర్, 2026 3:41 PM•ByNarender Kumar Nangunoori

Share this article

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం.. జలమయమైన రోడ్లు, అప్రమత్తమైన అధికారులు

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

విజయవాడ,సెప్టెంబర్ 12 (జనవాణి): ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పలు ప్రధాన రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గాంధీనగర్, సత్యనారాయణ స్వామి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు, రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గన్నవరం-విజయవాడ రహదారిపై ఇబ్బందులు

గన్నవరం-విజయవాడ మార్గంలో ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.

రాజమండ్రికి ఇండిగో విమానం మళ్లింపు

విజయవాడలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నై నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాన్ని రాజమండ్రి విమానాశ్రయానికి మళ్లించారు. విమానం రాజమండ్రిలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న 65 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. విజయవాడలో వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన అనంతరం విమానం రాజమండ్రి నుంచి గన్నవరం బయలుదేరే అవకాశం ఉంది.

దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత

భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. వర్షాలు తగ్గి పరిస్థితులు అనుకూలించే వరకు రాకపోకలను నిలిపివేశారు.

ఏపీకి ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరిక

మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ప్రజలను అప్రమత్తం చేసింది. అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు