సినీ జీవితంలోనే కాదు.. వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా మనిషి భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. చిన్న పొరపాటు అనుకున్నది కొన్నేళ్ల తర్వాత కోట్ల రూపాయల నష్టంగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి అనుభవమే ఒకప్పుడు టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ జీవితంలో కూడా చోటు చేసుకుంది. ఒకప్పుడు కేవలం రూ.10 లక్షలతో కొనుగోలు చేసే అవకాశం వచ్చిన భూమిని చివరి నిమిషంలో వదులుకోవడంతో.. నేడు దాని విలువ ఏకంగా రూ.5,000 కోట్లకు చేరిందని ఆయన స్వయంగా వెల్లడించిన విషయం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోజుల్లో పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఓ స్నేహితుడు చూపించిన 100 ఎకరాల భూమిని కొనాలని పృథ్వీ నిర్ణయించుకున్నారట. అప్పట్లో ఆ మొత్తం భూమి ధర కేవలం రూ.10 లక్షలు మాత్రమే. అయితే డీల్ ఫైనల్ చేసే సమయంలో ఆయన డ్రైవర్.. అక్కడంతా రాళ్లతో నిండి ఉందని, వాటిని తొలగించి ఫెన్సింగ్ వేయాలంటే మరో రూ.20 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో పృథ్వీ వెనక్కి తగ్గారట. చివరకు అదే డబ్బుతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలిపారు.
కాలం గడిచేకొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన వద్దనుకున్న ఆ 100 ఎకరాల భూమి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉండటంతో ఇప్పుడు అక్కడ ఒక్కో ఎకరం విలువ రూ.50 కోట్లకు పైగా పలుకుతోంది. అంటే అప్పట్లో రూ.10 లక్షలకు కొనుగోలు చేసే అవకాశం ఉన్న ఆ భూమి నేడు సుమారు రూ.5,000 కోట్ల విలువ చేస్తోంది. ఈ విషయాన్ని పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో పంచుకోవడంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. డ్రైవర్ చెప్పిన మాట నమ్మి జీవితంలోనే అతిపెద్ద అవకాశాన్ని కోల్పోయానని ఆయన చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
1997లో విడుదలైన 'పెళ్లి' సినిమాతో హీరోగా పరిచయమైన పృథ్వీ.. 'పెళ్లి పందిరి', 'ప్రేయసి రావే', 'దేవుళ్లు', 'కంటే కూతుర్నే కను', 'పంచదార చిలకా', 'సమ్మక్క సారక్క', 'బాచీ', 'చెన్నకేశవ రెడ్డి' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. కొంతకాలం తర్వాత సినిమాలకు దూరమైన ఆయన 'యానిమల్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం 'తండేల్', 'లైలా', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే రూ.5,000 కోట్ల విలువైన ఆ భూమి తన చేతుల నుంచి జారిపోవడం గురించి తెలుసుకున్న నెటిజన్లు.. "ఆ భూమి ఉండి ఉంటే ఇప్పుడు సినిమాల కోసం ఎదురుచూడాల్సిన అవసరమే ఉండేది కాదు" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.




















