హైదరాబాద్, ఆగస్టు 31 (జనవాణి): యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. ఈసారి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కాకుండా.. జిమ్‌లో వర్కౌట్స్, డ్యాన్స్ చేస్తూ రూపొందించిన వీడియోతో ఆమె నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. సోమవారం అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఆమె వేగంగా వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. అనంతరం పాప్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. వర్కౌట్స్‌తో పాటు డ్యాన్స్‌ను కలిపి రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఆగస్టు నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చింది’
ఈ వీడియోకు అనసూయ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. ఆగస్టు నెల తనను మరింత బలంగా మార్చిందని, చురుకుగా కదులుతూ, డ్యాన్స్ చేస్తూ, సంతోషంగా నవ్వుతూ, చెమటలు చిందిస్తూ ఈ నెలను గడిపానని పేర్కొన్నారు. అదే ఉత్సాహంతో ఆగస్టుకు సెండాఫ్ ఇస్తున్నట్లు తెలిపారు.
వీడియోపై నెటిజన్ల ట్రోలింగ్
అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనసూయ ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అనసూయను విమర్శించారు. ‘శివాజీ చెప్పింది ఇంకా మీ తలకు ఎక్కలేదా?’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘డబ్బులు వస్తున్నాయని ఏ వీడియో పడితే ఆ వీడియో పోస్ట్ చేయొద్దు.. డబ్బులు కాదు వ్యక్తిత్వం ముఖ్యం’ అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. అయితే అనసూయ వర్కౌట్స్, డ్యాన్స్‌పై పలువురు సానుకూలంగా కూడా స్పందిస్తున్నారు.
గతంలో ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై వివాదం
ఇటీవల ‘జై శ్రీరామ్’ నినాదంపై అనసూయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి. ఆమె వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అనసూయ స్పందిస్తూ.. భక్తి ముసుగులో మహిళలతో అనుచితంగా ప్రవర్తించే వారినే తాను ప్రశ్నించానని, తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని వివరణ ఇచ్చారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఆమె తాజా జిమ్ వీడియో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.




















