అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ‘కాకా ధూమ్ ధమాకా’ అంటూ సాగే ఈ పాట ప్రోమోలో పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించిన అనుపమ.. బరాత్‌లో మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ పాటలో అనుపమతో పాటు సీనియర్ నటుడు నరేశ్, తరుణ్ భాస్కర్ కూడా సందడి చేయనున్నారు. ‘కాకా ధూమ్ ధమాకా’ ఫుల్ సాంగ్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.
తెలంగాణ యాసలో సొంత డబ్బింగ్..
‘క్రేజీ కళ్యాణం’లో అనుపమ పరమేశ్వరన్ తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది. తన పాత్రకు మరింత సహజత్వం తీసుకురావడానికి తెలంగాణ యాసను ప్రత్యేకంగా నేర్చుకున్న అనుపమ.. ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఆమె ఓన్ వాయిస్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఓ అమ్మాయి పెళ్లి చుట్టూ జరిగే సరదా సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు భద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
‘భోగి’లోనూ తెలంగాణ యువతిగానే..
అనుపమ పరమేశ్వరన్ చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. ‘క్రేజీ కళ్యాణం’తో పాటు ‘భోగి’ సినిమాలోనూ ఆమె నటిస్తోంది. ఆదిలాబాద్–మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ కందుల సులోచన రాణి అనే యువతి పాత్రలో కనిపించనుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ‘భోగి’ కూడా ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది.




















