దివంగత నటుడు ‘రియల్ స్టార్’ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆస్మాన్’. రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేశ్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు.
శ్రీహరి జయంతి సందర్భంగా ఆగస్టు 15న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 16న సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
'మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోకచిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించని చీకట్లో ఉన్నారు. అదే నిజం' అంటూ వినిపించే విలన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
టీజర్‌లో హీరోయిన్ రాయంచ క్యూట్ లుక్‌లో కనిపించగా విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ యాక్షన్, ప్రత్యేక మేకోవర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. టీజర్‌ను బట్టి చూస్తే మూఢ నమ్మకాల నేపథ్యంలో సాగే ఫాంటసీ థ్రిల్లర్గా ‘ఆస్మాన్’ రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహరి సంగీతం అందిస్తుండగా, షోయబ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ఆస్మాన్’ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, అరబిక్ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
మేఘాంశ్ శ్రీహరి, రాయంచ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవి వర్మ, కమల్, రాజశేఖర్, కేశవ్ దీపక్, నిఖిల్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేఘాంశ్ శ్రీహరి ఇప్పటికే ‘రాజ్‌దూత్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఇప్పుడు ‘ఆస్మాన్’లో గత చిత్రంతో పోలిస్తే విభిన్నమైన లుక్, యాక్షన్ అవతార్‌లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.




















