‘ఆ నలుగురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసిన దర్శకుడు చంద్రసిద్ధార్థ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి విభిన్నమైన కాన్సెప్ట్‌తో మ్యూజికల్ థ్రిల్లర్‌ను రూపొందించారు.
లెంగ్తీ టైటిల్‌తో..
ఈ సినిమాకు ఏకంగా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే సుదీర్ఘమైన టైటిల్‌ను ఖరారు చేశారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన సినిమా టైటిల్ ఇదేనని దర్శకుడు చంద్రసిద్ధార్థ్ చెబుతున్నారు. ఈ చిత్రంలో హర్ష హీరోగా నటించగా.. అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.

సంగీతం.. మెదడు.. జ్ఞాపకాల చుట్టూ కథ
సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న ఆసక్తికరమైన సంబంధాన్ని ఆధారంగా చేసుకుని చంద్రసిద్ధార్థ్ ఈ కథను రూపొందించారు. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, పశ్చాత్తాపం వంటి అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయి. ఈ సినిమాకు జే రెక్స్ సంగీతం అందించారు. ప్రత్యేకత ఏమిటంటే.. సినిమాలోని నాలుగు పాటలకు చంద్రసిద్ధార్థ్ స్వయంగా సాహిత్యం అందించారు. దర్శకత్వంతో పాటు ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించారు.
రాత్రి 10:30కి ఒకే పాట.. అసలు మిస్టరీ ఏంటి?
ప్రతి రోజు రాత్రి సరిగ్గా 10:30 గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారం అవుతూ ఉంటుంది. నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి తదితరులు ఆ పాటను కోరుతుంటారు. అసలు ఆ పాట వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాన్ని కోరుతున్న శ్రోతలు ఎవరు? రేడియో స్టేషన్‌కు, ఈ వ్యక్తులకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నల చుట్టూ సినిమా సాగుతుంది.
దర్శకుడు చంద్రసిద్ధార్థ్ తన మిత్రుడు, దర్శకుడు మదన్‌తో కలిసి ఈ కథను తెరకెక్కించాలని గతంలో భావించారు. అయితే మదన్ మరణించడంతో సినిమా ఆలస్యమైందని ఆయన తెలిపారు. ‘ఆ నలుగురు’తో మానవ సంబంధాలపై తనదైన ముద్ర వేసిన చంద్రసిద్ధార్థ్.. ఈసారి సరికొత్త కాన్సెప్ట్‌తో మ్యూజికల్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.




















