చిరంజీవి–బాలకృష్ణ కాంబోపై బోయపాటి కీలక వ్యాఖ్యలు.. సినిమా పక్కా?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తే అది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించాలని తాను కోరుకుంటున్నట్లు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలిపారు. అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

5 అక్టోబర్, 2026 5:36 PM•ByNarender Kumar Nangunoori

Share this article

చిరంజీవి–బాలకృష్ణ కాంబోపై బోయపాటి కీలక వ్యాఖ్యలు.. సినిమా పక్కా?

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిలో ఎవరి సినిమా థియేటర్లలోకి వచ్చినా అభిమానులకు పండగే. అలాంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే సినిమాలో కనిపిస్తే.. ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌పై మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బోయపాటి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టాలీవుడ్ గురించి ప్రస్తావిస్తూ దేశంలో తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉందన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు టాలీవుడ్‌కు నాలుగు బలమైన స్తంభాలంటూ వ్యాఖ్యానించారు.

ఈ నలుగురిలో ఇద్దరు అగ్ర కథానాయకులతో కలిసి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టమని బోయపాటి అన్నారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి సినిమా చేయాలన్న తన కోరికను వెల్లడించారు. ఇద్దరు స్టార్లతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, ఆ సినిమా మరో స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

చిరు–బాలయ్య కాంబోపై ఎప్పటి నుంచో ఆసక్తి..

నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ.. మంచి కథ సిద్ధమైతే బాలకృష్ణతో కలిసి నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీనును ఉద్దేశించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరి ఇమేజ్‌లకు తగ్గట్టుగా భారీ యాక్షన్ కథను సిద్ధం చేసి, ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించే ధైర్యం ఉందా? అంటూ బోయపాటికి సవాల్ విసిరారు. అప్పటి నుంచి చిరంజీవి–బాలకృష్ణ కాంబినేషన్‌పై మెగా, నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బోయపాటి చేసిన వ్యాఖ్యలతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలను ఒకే తెరపై చూపించే అవకాశం బోయపాటికి ఎప్పుడు వస్తుందో చూడాలి.

‘అఖండ 3’పై కూడా అప్డేట్

ఇదిలా ఉంటే.. తన తదుపరి సినిమాను ఈ నెలాఖరులో ప్రకటించనున్నట్లు బోయపాటి తెలిపారు. మరోవైపు బాలకృష్ణతో ఆయన తెరకెక్కించిన సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘అఖండ’కు మూడో భాగం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ‘అఖండ 3’ కచ్చితంగా ఉంటుందని, సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు