హైదరాబాద్, ఆగస్టు 12 (జనవాణి): మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లను అధికారిక ప్రకటనకు ముందే సరదాగా బయటపెట్టడంలో మరోసారి తన మార్క్ చూపించారు. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి.. తన 158వ చిత్రానికి సంబంధించిన కీలక విషయాన్ని లీక్ చేశారు.
దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో సరదాగా మాట్లాడుతున్న చిరంజీవి.. టీజర్ మ్యూజిక్ వర్క్ పూర్తయిందా? చివర్లో ‘కదిరి’ అని టైటిల్ కార్డ్ వేశారా? అంటూ ప్రశ్నించారు. చిరు మాటలకు తమన్ స్పందించిన తీరు చూసి సినిమా టైటిల్ ‘కదిరి’ అయి ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. అధికారికంగా చిత్రబృందం టైటిల్ ప్రకటించకముందే చిరంజీవి నోటి నుంచి ఈ పేరు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ‘చిరు లీక్స్’ హ్యాష్‌ట్యాగ్ మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇదే సమయంలో ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా చిరంజీవి వెల్లడించారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుండగా..కన్నడ ప్రముఖ నటి రచితా రామ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మెగా 158 పై భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. కదిరి అనే టైటిల్ నిజమేనా? ఆగస్టు 22న విడుదల కానున్న టీజర్‌లో దీనిపై అధికారికంగా క్లారిటీ వస్తుందా? అనే ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది.
Loading Tweet...




















