డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా?
కథేంటి?
సూరి (ఫహాద్ ఫాజిల్)కి డబ్బంటే విపరీతమైన ఆశ. ఎలాగైనా డబ్బు సంపాదించి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వ్యక్తి. అనాథ అయిన అతడికి మెజీషియన్ మల్లేష్ (వెంకటేశ్ కాకుమాను) మాత్రమే స్నేహితుడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే సూరి ఓల్డ్ సిటీలోని ఎమ్మెల్యే, అండర్‌వరల్డ్ డాన్ అస్లామ్‌భాయ్ (మహేశ్ మంజ్రేకర్)ను మోసం చేస్తాడు.
ఈ విషయం బయటపడటంతో రెండు రోజుల్లో రూ.25 లక్షలు ఇవ్వాలని, లేదంటే తనను, మల్లేష్‌ను చంపేస్తానని అస్లామ్‌భాయ్ హెచ్చరిస్తాడు. దీంతో డబ్బు కోసం ఓ చిన్నారిని కిడ్నాప్ చేయాలని సూరి నిర్ణయించుకుంటాడు. అలా దివ్య (సారా పాలేకర్) అనే చిన్నారిని కిడ్నాప్ చేస్తాడు. అయితే దివ్య తన తల్లిదండ్రులు తన వల్లే మాయమయ్యారని భావిస్తూ వారిని మ్యాజిక్ చేసి తిరిగి తీసుకురావాలని సూరిని కోరుతుంది. అసలు విషయం ఏంటంటే సూరి కిడ్నాప్ చేసింది సాధారణ చిన్నారిని కాదు ఓ దెయ్యం పిల్లను. ఆ తర్వాత సూరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? దివ్య తల్లిదండ్రులను అతడు ఎలా కాపాడాడు? అస్లామ్‌భాయ్ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది సినిమా కథ.
కథనం ఎలా ఉంది?
ఆత్మలు, దెయ్యాలు తమవారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు హీరోల సహాయం కోరే కథలు కొత్తేమీ కాదు. అయితే ఒక దెయ్యం పిల్లను సాధారణ చిన్నారిగా భావించి హీరో కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని భయపడటం అనే పాయింట్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. సూరి తాను కిడ్నాప్ చేసింది దెయ్యం పిల్ల అని తెలుసుకునే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను నవ్విస్తాయి. ఆ సమయంలో సినిమా మంచి కామెడీ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే ఆ ప్రభావం సినిమా మొత్తం కనిపించదు. ప్రధాన సమస్య కథలో కొత్తదనం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం. ముఖ్యంగా కథలోని భావోద్వేగాలను బలంగా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. చిన్నారికి, ఆమె తల్లిదండ్రులకు మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలంగా చూపించి ఉంటే కథకు మంచి ఎమోషనల్ వెయిట్ వచ్చేది.
నటీనటుల పనితీరు
భిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే ఫహాద్ ఫాజిల్ మరోసారి తనదైన శైలిలో నటించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన స్థాయికి తగ్గట్టుగా పాత్రను తీర్చిదిద్దలేదనే భావన కలుగుతుంది. పాత్రలో బలమైన మలుపులు, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. దివ్య పాత్రలో సారా పాలేకర్ ఆకట్టుకుంది. చిన్నారి పాత్రకు తగిన నటనను అందించింది. ఇతర పాత్రల్లో శశాంక్, మహేశ్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, సుబ్బరాజు తదితరులు తమ పరిధిలో మెప్పించారు.
టెక్నికల్‌గా..
సినిమాలో బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. సీజీ వర్క్ కూడా కథకు తగ్గట్టుగా ఉంది. కాలభైరవ సంగీతంతో సన్నివేశాలకు అవసరమైన ప్రభావాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఫహాద్ ఫాజిల్ స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడంతో కొన్ని చోట్ల ఆయన డైలాగ్ డెలివరీ కాస్త సహజంగా అనిపించదు.
చివరగా..
నటీనటులు, సాంకేతిక బృందం తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ కథ, కథనం ఆశించిన స్థాయిలో లేకపోవడం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు ప్రధాన ప్రతికూలతగా మారింది. రాజమౌళి సమర్పణ, భారీ నిర్మాణ సంస్థల ప్రమేయంతో సినిమాపై ఏర్పడిన అంచనాలు కూడా ప్రేక్షకుల అనుభూతిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా కావడంతో చిన్నారులతో కలిసి వచ్చే కుటుంబ ప్రేక్షకులకు సినిమా కొంతవరకు నచ్చే అవకాశం ఉంది. అయితే ఫహాద్ ఫాజిల్ నుంచి మరింత బలమైన కథను ఆశించే వారికి మాత్రం ఈ సినిమా నిరాశ కలిగించవచ్చు.




















