సీనియర్ హీరోయిన్ నిత్యా మీనన్ కొత్త సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బెంగళూరు భామ.. త్వరలో ఓ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాలకు ఆమె గుడ్‌బై చెప్పిందంటూ వచ్చిన రూమర్లకు కూడా చెక్ పడినట్లే.
చివరిగా ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’లో హీరోయిన్‌గా కనిపించిన నిత్యా మీనన్.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ సమయంలో ఈవెంట్లు, సోషల్ మీడియాలోనూ ఆమె పెద్దగా కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడు ఓ క్రేజీ హారర్ ప్రాజెక్ట్‌తో ఆమె రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రైటర్‌గా.. ప్రొడ్యూసర్‌గా నిత్యా మీనన్!
‘యామిరుక్కా భయమే’, ‘కరుంగాప్పియమ్’ వంటి హారర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు డీకే ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. హారర్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ కథానాయికగా నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాకు డీకేతో కలిసి నిత్యా మీనన్ కథను అందించినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిర్మాతగానూ ఆమె వ్యవహరించనున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నమైన పాయింట్‌తో ఈ మూవీ రూపొందనున్నట్లు టాక్.
సొంత బ్యానర్‌పై తొలి సినిమా?
ఈ ఏడాదే కేయూరి ప్రొడక్షన్స్ పేరుతో నిత్యా మీనన్ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సమాచారం. ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఈ హారర్ సినిమాను నిర్మించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి నిత్యా మీనన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డైరెక్టర్ డీకే, నిత్యా మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తమిళంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళంలోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, నిత్యా మీనన్ గతంలో రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన 2’లో కీలక పాత్రలో నటించారు. ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు హారర్ జానర్‌లో వచ్చిన ఏకైక సినిమా ఇదే. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిని పెంచుతోంది.




















