హాలీవుడ్ సూపర్ హీరోల్లో స్పైడర్ మ్యాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీవీల్లో కార్టూన్‌గా ప్రసారమైన రోజుల నుంచే ఈ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. కాలక్రమేణా లైవ్ యాక్షన్ సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ మ్యాన్.. ఇప్పుడు హాలీవుడ్‌లో అత్యంత భారీ వసూళ్లు రాబట్టే ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. నైన్టీస్ కిడ్స్ నుంచి నేటి జెన్-జీ వరకు అందరికీ ఫేవరెట్‌గా మారిన ఈ సూపర్ హీరో లేటెస్ట్ మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఇండియాలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
ఈ సినిమా తొలి రోజే దేశవ్యాప్తంగా సుమారు రూ.73 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఈ స్థాయి ఓపెనింగ్స్ వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. నిజానికి ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సారి యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్‌ను చూపించారని.. టాక్ వచ్చింది. అయితే.. కలెక్షన్లపై మాత్రం ఆ టాక్ ఏమాత్రం పడలేదని ఈ వసూళ్లను చూస్తే తెలుస్తుంది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే'కు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో షోలు దక్కుతున్నాయి. దాంతో చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రీసెంట్‌గా రిలీజైన 'శ్రీనివాస మంగాపురం'తో పాటు ఇప్పటికే మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లపై కూడా ఈ హాలీవుడ్ మూవీ ప్రభావం పడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో పరిమిత స్క్రీన్లు ఉండటంతో స్థానిక సినిమాలకు షోల సంఖ్య తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది.
స్పైడర్ మ్యాన్ అనేది కేవలం ఓ సూపర్ హీరో పాత్ర మాత్రమే కాదు.. తరతరాలుగా కొనసాగుతున్న ఓ భావోద్వేగం. అమెరికా నుంచి ఇండియా వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ పాత్రకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. అయితే ఫస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమాల తరహాలో యాక్షన్, థ్రిల్, భావోద్వేగాల మధ్య సమతుల్యత ఉండే కథలనే అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో వచ్చే స్పైడర్ మ్యాన్ సినిమాలు కూడా అదే స్థాయి వినోదాన్ని అందించాలని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు.




















