Comrade Kalyan Trailor | విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వినూత్నంగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. టాలీవుడ్‌కు చెందిన రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ, శివ నిర్వాణ, నందిని రెడ్డి, బీవీఎస్ రవి, రామ్ అబ్బరాజు కలిసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఒకే వేదికపై తొమ్మిది మంది ప్రముఖ దర్శకులు ట్రైలర్‌ను విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆద్యంతం కామెడీ, వినోదంతో ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో శ్రీవిష్ణు ఓ థియేటర్ ఓనర్ పాత్రలో కనిపించనున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన ‘కామ్రేడ్’గా మారడం, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు కథలో ప్రధానంగా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్, మేనరిజమ్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయన తల్లి పాత్రలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు. శ్రీవిష్ణు, కమెడియన్ సత్య మధ్య వచ్చే సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెన్నెల కిషోర్, ఉపేంద్ర లిమాయే తదితరులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు జోడీగా మహిమా నంబియార్ నటిస్తున్నారు. షైన్ టామ్ చాకో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా తాజాగా వచ్చిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తన సినిమాకు మద్దతుగా నిలిచిన తొమ్మిది మంది దర్శకులకు కోన వెంకట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “నా బలం.. నా వాళ్లు” అంటూ వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పూర్తి స్థాయి వినోదంతో తెరకెక్కిన ‘కామ్రేడ్ కల్యాణ్’ ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది.



















