డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా మీడియా కంట పడటంతో ఈ రూమర్లు మరింత బలపడ్డాయి. తాజాగా వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వినాయక చవితి రోజున వైరల్ ఫొటో..
వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈషా రెబ్బాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో వీరి వెనుక వినాయకుడి విగ్రహం కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి వినాయకుడిని పూజించినట్లుగా ఈ ఫొటో కనిపించడంతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఫొటోకు తరుణ్ భాస్కర్ స్మైలింగ్ ఫేస్ ఎమోజీని జోడించడం కూడా చర్చకు దారితీసింది. ఇప్పటికే దాదాపు రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ఫొటోను చూసిన నెటిజన్లు తమ ప్రేమకు తరుణ్ భాస్కర్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా మరోసారి తెరపైకి వచ్చాయి.
పెళ్లి రూమర్లకు మరింత బలం..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుక కోసం ఈషా రెబ్బా రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో తరుణ్ భాస్కర్‌తో కలిసి కనిపించింది. అలాగే గతేడాది హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో వీరి మధ్య ఉన్న రిలేషన్‌పై అప్పటినుంచే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తాజాగా షేర్ చేసిన ఫొటోకు నటి కావ్య కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. “పండగ రోజు మంచి పులిహోర తిన్న ఫీల్ ఉంది ఈ ఫొటోలో” అంటూ ఆమె సరదాగా కామెంట్ చేసింది. శివాత్మిక రాజశేఖర్, షాలిని కొండెపూడితో పాటు పలువురు నటీమణులు లవ్ ఎమోజీలతో స్పందించారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఫొటోకు భారీగా లైక్స్ రావడం విశేషం.
‘ఓం శాంతి శాంతి శాంతి’లో కలిసి..
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో విడుదలైంది. ఈషా రెబ్బా టాలీవుడ్‌లోకి ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అ!’, ‘దర్శకుడు’, ‘అమీతుమీ’, ‘బ్రాండ్ బాబు’, ‘మామా మశ్చీంద్ర’ తదితర చిత్రాల్లో నటించింది.
మరోవైపు ‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడాకోలా’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటుడిగానూ ‘మీకు మాత్రమే చెప్తా’, ‘గాయపడ్డ సింహం’ వంటి సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
తరుణ్ భాస్కర్‌కు గతంలో లతా నాయుడుతో వివాహం జరిగింది. అయితే వారి వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈషా రెబ్బాతో ఆయన రిలేషన్‌షిప్, పెళ్లిపై వస్తున్న తాజా ప్రచారం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ జంట తమ ప్రేమ, పెళ్లి విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.




















