‘ది ప్యారడైజ్’ కథేంటి?
దేశానికి స్వాతంత్రం వచ్చినా సమాజంలో గుర్తింపుకు నోచుకోని ఐదు వేల మంది సవారీల జీవితాల చుట్టూ ‘ది ప్యారడైజ్’ కథ తిరుగుతుంది. హైదరాబాద్‌లోని దొరలు వారితో దొంగ సారా తయారు చేయించుకుంటూ తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు తప్ప కనీస మానవ హక్కులు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలను అందించరు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని సమ్మక్క (సోనాలీ కులకర్ణి) పోరాటం మొదలుపెడుతుంది. మాలిక్ (మోహన్ బాబు) దాష్టికానికి ఆమె కవలల పిల్లలను కంటే అందులో ఆడపిల్ల పురిటీలోనే కన్నుమూస్తుంది. దాంతో కొడుకునే కూతురిలా జడలు వేసి పెంచుతుంది. అతనే జడల్ (నాని). అయితే తల్లి ప్రవర్తన సరైనది కాదని జనమంతా అంటుంటే అదే నిజమని నమ్మి ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు జడల్.
చిన్న వయసులోనే హత్య చేసి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా తన వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని తెలుసుకుంటాడు. ఆ తర్వాత మాలిక్, అతని కొడుకు చోటా మాలిక్‌పై జడల్ ఎలా పోరాడాడు? తన తల్లి త్యాగాన్ని ఎలా గుర్తించి, ఆమెను గౌరవించాడు? సవారీలు ఈ దేశంలో భాగమేననే గుర్తింపు తీసుకు రావడానికి ఏ రాజకీయ నాయకుడు నడుం బిగించాడు? అనేది 'ది ప్యారడైజ్' కథ.
కథాంశం బాగున్నా.. కథనం తడబడింది
అస్తిత్వం, గుర్తింపు కోసం ఓ సమూహం చేసే పోరాటం అనేది బలమైన కథాంశమే. అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ అంశాన్ని చెప్పే క్రమంలో కథను మరింత విస్తరించి, ప్రత్యేక దేశం ఏర్పాటు దిశగా తీసుకెళ్లారు. అధికారం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం కాస్తా ఆయుధ పోరాటంగా మారుతుంది. ఆ తర్వాత రాజకీయ పరిష్కారం కోసం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పాత్రలను కథలోకి తీసుకొస్తారు. దీంతో అసలు కథకు సంబంధించిన భావోద్వేగం క్రమంగా పక్కకు వెళ్లిన భావన కలుగుతుంది. అస్తిత్వ పోరాట కథల్లో భావోద్వేగం కీలకం. కానీ ఈ సినిమాలో భారీ హింస, రక్తపాతం ఎక్కువగా కనిపించడంతో.. పాత్రలు ఎందుకు పోరాడుతున్నాయనే అంశం కంటే తెరపై కనిపించే హింసే ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సమస్యకు సరైన పరిష్కారం చూపించకుండా ముఖ్యమంత్రి పాత్రను తీసుకొచ్చి ముగించడం అంతగా ప్రభావం చూపదు. కొన్ని సన్నివేశాలు కథకు అవసరమా అనే సందేహాన్ని కూడా కలిగిస్తాయి.
నాని నటన ఎలా ఉంది?
జడల్ పాత్రలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. పాత్ర కోసం అతను పడిన కష్టం, మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నాని ఇటీవలి కాలంలో ఎంచుకుంటున్న కొన్ని కథలు అతని సహజమైన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దూరంగా వెళ్తున్నాయి. మాస్ ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో కథ ఎంపిక విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ మెప్పించలేకపోతున్నాయి. ‘ది ప్యారడైజ్’లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
మిగతా నటీనటులు
జడల్ తల్లి సమ్మక్కగా సోనాలీ కులకర్ణి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె పాత్రలోని భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. ఆమె స్నేహితురాలిగా నటించిన ఈశ్వరీరావు కూడా ఆకట్టుకున్నారు. మోహన్ బాబుకు మాలిక్ పాత్ర మంచి అవకాశం ఇచ్చింది. ఆయన కొడుకుగా నటించిన రాఘవ్ జుయల్ తెరపై కనిపించిన ప్రతిసారీ ప్రత్యేకమైన వైబ్‌ను తీసుకొచ్చాడు. ప్రియదర్శి ఎమ్మెల్యే శంకరరావు పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుడి హావభావాలను అనుకరించే సన్నివేశాలు చర్చకు దారితీసే అవకాశం ఉంది. తనికెళ్ల భరణి, సంపూర్ణేశ్ బాబు, రాజా రవీంద్ర, రామ్ జగన్, సత్యరాజ్, సత్య ప్రకాశ్ తదితరులు తమ పరిధిలో పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచే ప్రయత్నం చేసింది. యాక్షన్ సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్ ఇచ్చింది. అయితే పాటలు విడిగా విన్నప్పుడు వచ్చిన ఇంపాక్ట్ సినిమాలో అంతగా కనిపించదు. నిర్మాణ విలువలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. నాని, నిర్మాత చెరుకూరి సుధాకర్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాపై పెట్టిన శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది.
చివరగా..
‘ది ప్యారడైజ్’లో చెప్పాలనుకున్న పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం మాత్రం పూర్తిగా మెప్పించదు. అస్తిత్వ పోరాటం, సామాజిక వివక్ష వంటి అంశాల కంటే హింస, రాజకీయ అంశాలు ఎక్కువగా హైలైట్ కావడంతో అసలు భావోద్వేగం పలుచబడింది. నాని తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసినా కథ, కథనం ఆ స్థాయిలో అతనికి సహకరించలేదు. భారీ అంచనాలతో వెళ్లే ప్రేక్షకులకు సినిమా నిరాశ కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే భిన్నమైన కథాంశాలు, ప్రయోగాత్మక చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రం సినిమాలో కొన్ని అంశాలు ఆసక్తిని కలిగించవచ్చు.




















