భూపాలపల్లి, అక్టోబర్ 2 (జనవాణి): భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో భర్త హత్య కేసు సంచలనంగా మారింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి అతడిని హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బుద్దారం గ్రామానికి చెందిన సుమలతకు గొల్లపల్లికి చెందిన పెండల సంపత్ (32)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కోరిక మేరకు సంపత్ అత్తారింట్లోనే ఉంటూ ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
శ్రీకాంత్‌తో పరిచయం.. వివాహేతర సంబంధంగా మారిన వైనం
సుమలతకు అదే గ్రామానికి చెందిన ఉమ్మల శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త సంపత్‌కు తెలియడంతో భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయితే తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సుమలత సంపత్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రియుడు శ్రీకాంత్‌కు చెప్పగా అతడు కూడా అందుకు అంగీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పురుగుల మందు కలిపిన మద్యం తాగించి హత్య
భర్తను హత్య చేసేందుకు సుమలత, శ్రీకాంత్ కలిసి పథకం రచించారు. శ్రీకాంత్ తనకు సహకరించేందుకు తరుణ్ అనే వ్యక్తిని సంప్రదించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు సహకరిస్తే రూ.లక్ష ఇస్తామని అతడికి చెప్పినట్లు సమాచారం. పథకం ప్రకారం సెప్టెంబర్ 17న సంపత్‌ను మద్యం తాగేందుకు శ్రీకాంత్ పిలిచాడు. బుద్దారం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో పురుగుల మందు కలిపిన మద్యం సంపత్‌తో తాగించినట్లు పోలీసులు తెలిపారు. అది తాగిన కొద్దిసేపటికే సంపత్ మృతి చెందాడు. అనంతరం శ్రీకాంత్, తరుణ్ కలిసి సంపత్ మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మృతదేహం చుట్టూ పురుగుల మందు చల్లి సంపత్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
మృతుడి తల్లి అనుమానంతో వెలుగులోకి అసలు నిజం
మొదట కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సంపత్ మృతిపై అతడి తల్లికి అనుమానం కలిగింది. కుమారుడు చనిపోయిన సమయంలో కోడలు సుమలత ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె ఇది ఆత్మహత్య కాదని, హత్య జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో సుమలత, శ్రీకాంత్‌ల మధ్య ఉన్న సంబంధం, సంపత్ హత్యకు జరిగిన కుట్రకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో సుమలత, శ్రీకాంత్ పెద్దల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు.




















