యాదాద్రి భువనగిరి,సెప్టెంబర్ 19 (జనవాణి): యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 18 రోజులకే ఓ బీటెక్ విద్యార్థిని కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి (20) ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. పల్లవికి ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం కొంతకాలం కళాశాలకు వెళ్లని పల్లవి సెప్టెంబర్ 17 నుంచి తిరిగి కాలేజీకి హాజరవుతోంది.
కాలేజీ భవనం నుంచి దూకి..
సెప్టెంబర్ 18న విద్యార్థులంతా వెళ్లిపోయిన అనంతరం పల్లవి కళాశాల భవనంలోని మూడో అంతస్తుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కళాశాల సిబ్బంది ఆమెను జీడిమెట్లలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పల్లవి మృతి చెందింది.
అదనపు కట్నం వేధింపుల ఆరోపణలు
తమ కుమార్తె ఆత్మహత్యకు అదనపు కట్నం కోసం జరిగిన వేధింపులే కారణమని పల్లవి తల్లి సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన తర్వాత భర్త నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదురయ్యాయని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులతో మనస్తాపానికి గురైన పల్లవి బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇతర కారణాలపైనా పోలీసుల దర్యాప్తు
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం కోసం వేధింపులే ఆత్మహత్యకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత కొద్దిరోజులకే పల్లవి కాలేజీకి తిరిగి వచ్చి, రెండో రోజే ఆత్మహత్యకు పాల్పడటానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. పల్లవి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు చేసిన కట్న వేధింపుల ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.




















