పాత పరిచయం పేరుతో వేధింపులు.. వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి, వీడియోలతో బెదిరింపులు

పదో తరగతిలో ఏర్పడిన పరిచయం ఓ వివాహితకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాత పరిచయంతో ఆమెతో తరచూ మాట్లాడిన ఓ కానిస్టేబుల్ కరీంనగర్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి రూ.1.30 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. చివరకు వీడియోలను భర్తకు పంపడంతో ఆమె కాపురం కూడా దెబ్బతింది.

6 అక్టోబర్, 2026 12:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పాత పరిచయం పేరుతో వేధింపులు.. వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి, వీడియోలతో బెదిరింపులు

Social Media Image

కరీంనగర్‌, అక్టోబర్ 6 (జనవాణి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్‌ మండలానికి చెందిన ఓ యువతికి పదో తరగతిలో ఉదయ్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలం తర్వాత ఆ పరిచయం ఫోన్‌ సంభాషణల వరకు వెళ్లింది. ప్రస్తుతం ఉదయ్‌ హైదరాబాద్‌లోని టీజీఎస్పీ 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, యువతికి మరో వ్యక్తితో వివాహం జరగడంతో కరీంనగర్‌లో భర్తతో కలిసి నివసిస్తోంది.

అయితే పాత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఉదయ్‌ ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఏడాది మార్చి 3న కరీంనగర్‌కు వెళ్లిన ఉదయ్‌ ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఆగస్టు 20, 21 తేదీల్లో తన నుంచి రూ.1.30 లక్షలు తీసుకున్నాడని ఆరోపించింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఉదయ్‌ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి భర్త ముందే గొడవకు దిగినట్లు తెలిపింది. అంతేకాకుండా రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను ఆమె భర్తకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితురాలిని భర్త ఇంటి నుంచి పంపించడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ క్రమంలో ఆమెకు గర్భస్రావం కూడా జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటనపై బాధితురాలు తొలుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును కరీంనగర్‌ గ్రామీణ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో కరీంనగర్‌ గ్రామీణ పోలీసులు ఉదయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు