హైదరాబాద్, సెప్టెంబర్ 13 (జనవాణి): వీకెండ్ వచ్చిందంటే చాలు.. పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్ చేసి మద్యం మత్తులో వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 292 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 240 మంది బైకర్లు, 12 మంది ఆటో డ్రైవర్లు, 40 మంది కారు డ్రైవర్లు ఉన్నారు. అధిక మోతాదులో మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో 14 మంది వాహనదారులకు 301 నుంచి 550 మధ్య బీఏసీ (Blood Alcohol Concentration) నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం 292 మందిని చట్టపరమైన చర్యల్లో భాగంగా కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగి ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక గత వారం డ్రంకెన్ డ్రైవింగ్‌కు సంబంధించిన 681 కేసులను కోర్టులు పరిష్కరించగా, 18 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు. మరో ఏడుగురికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్ శిక్ష విధించగా, మిగిలిన 656 మందికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.




















