హైదరాబాద్, అక్టోబర్ 2 (జనవాణి): హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఓ వ్యక్తి కర్రతో ఆలయంలోకి ప్రవేశించాడు. పూజారిపై దాడికి యత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కర్రతో కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
వ్యక్తి ప్రవర్తనను గమనించిన భక్తులు వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. చైతన్యపురి పోలీసులు ఆలయానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు నిందితుడిని మహమ్మద్ అన్సారీగా గుర్తించారు. అయితే అమ్మవారి విగ్రహంపై దాడి చేయడానికి గల కారణం, అతడి ఉద్దేశం ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ఘటనకు ముందు నిందితుడి కదలికలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై పూజారి, ఆలయ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఆలయంలో జరిగిన ఘటనపై భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయంలోకి ప్రవేశించి విగ్రహంపై దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Loading Tweet...




















