హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. విశాఖపట్నానికి చెందిన ఓ డ్యాన్స్ బృందం నిమజ్జన వేడుకల్లో ప్రదర్శన ఇస్తుండగా ఓ యువతి ఏకంగా కొండచిలువను మెడలో వేసుకుని డ్యాన్స్ చేసింది. భారీ కొండచిలువతో ఆమె చేసిన విన్యాసాలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్స్ (GHSPCA) రంగంలోకి దిగింది. కొండచిలువతో డ్యాన్స్ చేసిన బృందాన్ని గుర్తించేందుకు అధికారులు సుమారు ఐదు రోజుల పాటు ప్రయత్నించారు.
చివరకు మధురానగర్ పోలీసుల సహకారంతో విశాఖకు చెందిన డ్యాన్స్ బృందాన్ని గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న ఇండియన్ రాక్ పైథాన్‌ను పోలీసులు, GHSPCA బృందం స్వాధీనం చేసుకుంది. కొండచిలువను మెడలో వేసుకుని బహిరంగ ప్రదర్శన నిర్వహించడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రదర్శన కోసం కొండచిలువను ఎలా తీసుకొచ్చారు? దాని సంరక్షణకు సంబంధించిన నిబంధనలు పాటించారా? అనే అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
Loading Tweet...




















