హైదరాబాద్,సెప్టెంబర్ 16 (జనవాణి): ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో అరెస్టై అనంతరం బెయిల్‌పై విడుదలైన ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమ్మంది రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఫ్రీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఆస్తులు, ప్రాపర్టీ డిపాజిట్లను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని, తన ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లను అన్‌ఫ్రీజ్ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఐబొమ్మ కేసులో అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
ఉన్నత చదువుల కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవి.. అనంతరం ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీ సినిమాలను ప్రసారం చేస్తూ భారీగా డబ్బులు సంపాదించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. చాలా కాలం విదేశాల్లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడిపినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అంతేకాకుండా పోలీసులకు సవాల్ విసిరినట్లు కూడా రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వ్యక్తిగత కారణాలతో విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని అరెస్ట్ చేసి విచారించారు. సుమారు మూడు నెలల పాటు జైలులో ఉన్న ఆయన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తన బ్యాంక్ ఖాతాల్లోని నిధులను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ రవి కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.




















