మహబూబాబాద్‌లో మిస్సింగ్‌ కేసుల కలకలం.. 246 కేసులు నమోదు?

మహబూబాబాద్‌ జిల్లాలో మహిళలు, బాలికల అదృశ్య కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 246 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. సోషల్‌ మీడియా పరిచయాలు, ప్రేమ పేరుతో మాయమాటలు వంటి అంశాల నేపథ్యంలో బాలికలు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు, స్థానికులు చెబుతున్నారు.

1 అక్టోబర్, 2026 12:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మహబూబాబాద్‌లో మిస్సింగ్‌ కేసుల కలకలం.. 246 కేసులు నమోదు?

Social Media Images

మహబూబాబాద్‌ జిల్లా, అక్టోబర్ 1 (జనవాణి): జిల్లాలో మహిళలు, బాలికల అదృశ్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 246 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తమ పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సోషల్‌ మీడియా పరిచయాలతో జాగ్రత్త

సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో కొందరు బాలికలను లక్ష్యంగా చేసుకుని పరిచయాలు పెంచుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి వేదికల ద్వారా పరిచయాలు ఏర్పడి, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికలను ఆకర్షిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిచయాల విషయంలో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎన్ని కేసులు?

మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నమోదైన 246 మిస్సింగ్‌ కేసుల్లో మహబూబాబాద్‌ టౌన్‌ పరిధిలో అత్యధికంగా 43 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తొర్రూరులో 32, కేసముద్రంలో 25, డోర్నకల్‌లో 20, గూడూరులో 19, మహబూబాబాద్‌ రూరల్‌లో 18 కేసులు నమోదయ్యాయి.

ఇతర ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి:

బయ్యారం – 12

చిన్నగూడూరు – 2

దంతాలపల్లి – 6

గంగారం – 2

గార్ల – 9

ఇనుగుర్తి – 3

కొత్తగూడ – 9

కురవి – 9

మరిపెడ – 10

నర్సింహులపేట – 7

నెల్లికుదురు – 11

పెద్దవంగర – 5

సీరోలు – 4

పట్టణ ప్రాంతాల్లోనే అధిక కేసులు

మొత్తం కేసుల్లో మహబూబాబాద్‌ టౌన్‌, తొర్రూరు, కేసముద్రం వంటి పట్టణ ప్రాంతాల పరిధిలోనే అధిక సంఖ్యలో మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో బాలికలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

పిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వారు ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? సోషల్‌ మీడియాలో ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారికి ఎదురయ్యే సమస్యలను స్వేచ్ఛగా చెప్పే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షీటీమ్స్‌ నిఘాను పెంచాలని, పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు సైబర్‌ భద్రత, చైల్డ్‌ సేఫ్టీ, పోక్సో చట్టాలపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

ఎస్పీ శబరీష్‌ ఏమన్నారంటే..

జిల్లాలో మహిళలు, బాలికలు, మైనర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ శబరీష్‌ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు చైల్డ్‌ సేఫ్టీ, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు, మైనర్ల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు