మద్యం, జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని తల్లి ఇంటిని తగలబెట్టిన కొడుకు

మద్యం, మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లి నివసిస్తున్న ఇంటికే నిప్పుపెట్టాడు. పెట్రోల్ పోసి ఇంటిని దహనం చేయడంతో విలువైన వస్తువులతో పాటు రేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

5 అక్టోబర్, 2026 5:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మద్యం, జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని తల్లి ఇంటిని తగలబెట్టిన కొడుకు

మెదక్,అక్టోబర్ 5 జనవాణి): మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్‌ గ్రామంలో కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నస్కల్‌ గ్రామానికి చెందిన రజిని సుమారు 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె స్వగ్రామంలోనే ఉంటూ రేషన్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. రజిని కుమారుడు గౌతమ్ రెడ్డి మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసై జులాయిగా తిరిగేవాడని పోలీసులు తెలిపారు. గతంలో అతనిపై గంజాయి కేసు కూడా నమోదైంది. కొత్త కారు కొనుగోలు చేయడంతో పాటు జల్సాల కోసం డబ్బులు కావాలంటూ తరచూ తల్లిని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే దూషించడం, దాడి చేయడం, చంపేస్తానంటూ బెదిరించడం చేసేవాడని సమాచారం.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో మరోసారి తల్లితో గొడవకు దిగాడు. కుమారుడి ప్రవర్తనతో భయపడిన రజిని ప్రాణభయంతో ఇంటి నుంచి బయటకు వచ్చి రామాయంపేటలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయారు. తల్లి ఇంట్లో లేకపోవడంతో మరింత ఆగ్రహానికి గురైన గౌతమ్ రెడ్డి అదే రాత్రి ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు రేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఘటనపై బాధితురాలు రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు