హైదరాబాద్, అక్టోబర్ 5 జనవాణి): మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ గోల్డ్ షాప్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో షాప్ షెట్టర్‌ను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం.
వరంగల్ జాతీయ రహదారిపై మేడిపల్లి మెయిన్ రోడ్డులో ఉన్న గోల్డ్ షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాలు చోరీకి గురైనట్లు షాపు సిబ్బంది తెలిపారు. డైమండ్స్‌తో పాటు బంగారు ఆభరణాలు కూడా అపహరణకు గురైనట్లు మేనేజర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. సోమవారం ఉదయం షాప్‌కు వచ్చిన సిబ్బంది షెట్టర్ తొలగించి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాప్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ చోరీలో దాదాపు ఏడుగురు దుండగులు పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.




















