మరణించి 20 ఏళ్లు దాటినా..చెరిగిపోని స్వరం.. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెరపై!

భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మహాగాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. ఆమెలోని గాన మాధుర్యం తరాలు మారినా శ్రోతలను అలరిస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో కచేరీ చేసిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా, భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా ఆమె ఎన్నో చరిత్రాత్మక ఘనతలు సాధించారు. ఇప్పుడు ఆమె జీవిత కథ వెండితెరపైకి వస్తుండటంతో మరోసారి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరు మార్మోగుతోంది.

19 సెప్టెంబర్, 2026 4:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మరణించి 20 ఏళ్లు దాటినా..చెరిగిపోని స్వరం.. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెరపై!

MS Subbulakshmi Biopic (social Media Image)

  • ఐక్యరాజ్యసమితి నుంచి తిరుమల కొండల వరకు సంగీత ప్రపంచాన్ని శాసించిన మహాగాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి ప్రస్థానం తెలుసుకుందాం..

  • సంగీత సరస్వతిగా ఎదిగిన బాల్యం

1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించారు మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. వీణా విద్వాంసురాలైన తల్లి షణ్ముగవడివు వద్ద చిన్న వయసులోనే సంగీత సాధన ప్రారంభించారు. అసాధారణ ప్రతిభతో ఎదిగిన ఆమె కేవలం 13 ఏళ్ల వయసులోనే మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో తొలి కచేరీ చేసి సంగీత పండితులను ఆకట్టుకున్నారు. సంగీతంతో పాటు సినీ రంగంలోనూ తన ప్రతిభను చాటారు. సేవాసదనం, శాకుంతలై, సావిత్రి వంటి చిత్రాల్లో నటించి, పాటలు పాడారు. ముఖ్యంగా 1945లో విడుదలైన మీరా చిత్రం ఆమెకు దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో ఆమె పాడిన భజనలు భాషా సరిహద్దులను దాటి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి.

MS Subbalaxmi
  • ప్రపంచ వేదికపై భారతీయ సంగీతానికి కీర్తి

ఎంఎస్ సుబ్బులక్ష్మి గాన ప్రస్థానంలో ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలున్నాయి. 1966లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిష్టాత్మక కచేరీ నిర్వహించి అంతర్జాతీయ వేదికపై భారతీయ శాస్త్రీయ సంగీత సౌందర్యాన్ని చాటారు. అలాగే లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో కచేరీ నిర్వహించిన తొలి భారతీయ కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 1974లో రామన్ మెగసెసే అవార్డును అందుకుని ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ గాయనిగా చరిత్ర సృష్టించారు.

MS Subbalaxmi
  • భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలు

ఎంఎస్ సుబ్బులక్ష్మి అందుకున్న పురస్కారాల్లో అత్యున్నతమైనది భారతరత్న. 1998లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆమెను భారత ప్రభుత్వం గౌరవించింది. అంతకుముందు 1954లో పద్మభూషణ్, 1975లో పద్మవిభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. 1968లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అందించే ప్రతిష్టాత్మక సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.

ms subbalaxmi
  • తిరుమలలో నిత్యం వినిపించే అమృత గాత్రం

ఎంఎస్ సుబ్బులక్ష్మి స్వరం ఆధ్యాత్మిక సంగీతంలోనూ చెరగని ముద్ర వేసింది. ఆమె ఆలపించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం నేటికీ ఎంతోమంది ఇళ్లలో ఉదయాన్ని ప్రారంభించే మధుర స్వరంగా నిలిచింది. విష్ణు సహస్రనామం, భజ గోవిందం తదితర భక్తి గీతాలు ఆమె గాత్రంలో మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా ఆమె అందించిన సేవలు కూడా చిరస్మరణీయం. మరణించి 20 ఏళ్లు దాటినా తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి గారిదే.

Thirumal
  • గానంతో పాటు సేవా కార్యక్రమాలు

సంగీతాన్ని కేవలం కళగా కాకుండా సేవకు సాధనంగా భావించారు ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఆమె నిర్వహించిన అనేక స్వచ్ఛంద కచేరీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖులు కూడా ఆమె గాత్రానికి అభిమానులుగా నిలిచారు. నెహ్రూ ఆమెను ప్రశంసిస్తూ సంగీత ప్రపంచంలో ఆమె స్థానాన్ని ప్రత్యేకంగా కొనియాడారు.

Nehru
  • వెండితెరపైకి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం

మహాగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ‘ఎంఎస్ – ఏ లెగసీ ఆన్ స్క్రీన్’ పేరుతో రూపొందుతున్న బయోపిక్‌లో నటి రష్మిక మందన్న ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

MS Fiilm

మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఎంఎస్ సుబ్బులక్ష్మి గాత్రం మాత్రం శ్రోతల జ్ఞాపకాల్లో సజీవంగానే ఉంది. ఇప్పుడు ఆమె జీవితం, సంగీత ప్రయాణం వెండితెరపైకి రావడం ద్వారా కొత్త తరానికి కూడా ఈ మహాగాయని వారసత్వం పరిచయం కానుంది.

subbalaxmi image

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు