హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): హైదరాబాద్ శంషాబాద్‌లోని సిద్ధేశ్వర కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల తన ప్రియుడు కలలోకి వచ్చి తనను దగ్గరకు రమ్మంటున్నాడని కుటుంబ సభ్యులతో చెప్పిన యువతి కొద్దిరోజులకే ఈ విషాద నిర్ణయం తీసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన బూర నర్మద (19) నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ బేజనీ గౌడ్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఇద్దరూ భావించారు. పెళ్లి నాటికి జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ్ మృతి చెందాడు. దీంతో నర్మద తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేక తరచూ అతడి గురించే ఆలోచిస్తూ బాధపడేదని చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువులు ధైర్యం చెప్పినా ఆమెలో మార్పు రాలేదని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల సిద్ధార్థ్ తన కలలోకి వచ్చి తనను దగ్గరకు రమ్మంటున్నాడని నర్మద తల్లిదండ్రులు, సోదరితో చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని చెబుతూ ఆమె తీవ్రంగా బాధపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నర్మద బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నర్మద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
నర్మద మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రియుడి మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన యువతి ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కూడా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















