హైదరాబాద్, ఆగస్టు 31 (జనవాణి): హైదరాబాద్ తుక్కుగూడలో చోటుచేసుకున్న నర్సు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నర్సుపై అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణైంది. ఈ విషయాన్ని దర్యాప్తులో నిందితుడు సనా వుల్లా కూడా అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో ఇప్పటికే నమోదైన కేసులో అత్యాచారం సెక్షన్‌ను చేర్చనున్నారు.
రాఖీ పండగ సందర్భంగా తోటి నర్సులు స్వగ్రామాలకు వెళ్లడంతో బాధితురాలు హాస్టల్‌లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో ఈనెల 29న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆసుపత్రి సమీపంలోని కార్ల మెకానిక్ షాపులో పనిచేసే సనా వుల్లాపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు కిటికీ ద్వారా హాస్టల్‌లోకి ప్రవేశించినట్టు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. అత్యాచారాన్ని నర్సు ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. తాజాగా పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కావడంతో కేసు మరింత కీలక దశకు చేరుకుంది. నిందితుడిపై అత్యాచారం సెక్షన్‌ను చేర్చి తదుపరి దర్యాప్తును పోలీసులు కొనసాగించనున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతి సుమారు ఏడు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ.. ఆస్పత్రికి సమీపంలో నివసిస్తోంది. అయితే శనివారం ఆమె ఫోన్ కాల్స్‌కు ఎంతకీ స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన సహోద్యోగులు ఆమె నివాసానికి వెళ్లారు. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలోంచి చూడగా.. యువతి నేలపై పడి కనిపించింది. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన సహోద్యోగులు.. యువతి రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యువతి నివసిస్తున్న గదికి వెనుక భాగంలో ఓ మెకానిక్ షాప్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.




















