నర్సంపేట, ఆగస్టు 05(జనవాణి): ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం, సంతాప సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై స్థానిక నాయకులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తుండిపోతారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారని, ఉద్యమ స్ఫూర్తిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
బీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధికి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన కృషి ఎంతో విలువైనదని, ఆయన మరణం పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన లేని లోటు రాజకీయంగా, సామాజికంగా ఎప్పటికీ భర్తీ చేయలేనిదని అభిప్రాయపడ్డారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.





















