వరంగల్, ఆగస్టు 09 (జనవాణి): ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఆదివారం నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి తాను, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.2.25 కోట్ల చెక్కును కేసీఆర్ అందజేశారు. ఇందులో ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు అందించనున్నారు. మిగిలిన రూ.25 లక్షలను పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ సంక్షేమం కోసం బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు.పిల్లల భవిష్యత్తు, చదువులు, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. వారికి ఎలాంటి లోటు రాకుండా తాను, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
కేసీఆర్ నల్లబెల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దశదిన కార్యక్రమం అనంతరం కేసీఆర్ నల్లబెల్లి నుంచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు.




















